బీజేపీలో పీక్ స్టేజ్‌కు విభేదాలు.. ఆ ‘నలుగురు’ నేతలది తలోదారి..

దిశ, కంటోన్మెంట్ : ఎవరికి వారే.. యమున తీరే.. అన్నట్లు తయారైంది కంటోన్మెంట్ బీజేపీ పరిస్థితి. నలుగురు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుల మధ్యన సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తోంది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడాల్సిన నాయకులు విభేదాల కారణంగా ఏకతాటిపై నడవలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమౌతున్నారు. కంటోన్మెంట్ బోర్డు బీజేపీలో నెలకొన్న ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం ఉంటుంది..? నాయకులు కలిసి కట్టుగా పోరాటం […]

Update: 2021-06-26 05:53 GMT

దిశ, కంటోన్మెంట్ : ఎవరికి వారే.. యమున తీరే.. అన్నట్లు తయారైంది కంటోన్మెంట్ బీజేపీ పరిస్థితి. నలుగురు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుల మధ్యన సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తోంది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడాల్సిన నాయకులు విభేదాల కారణంగా ఏకతాటిపై నడవలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమౌతున్నారు. కంటోన్మెంట్ బోర్డు బీజేపీలో నెలకొన్న ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం ఉంటుంది..? నాయకులు కలిసి కట్టుగా పోరాటం చేసే ఛాన్సే లేదా..? అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

తారాస్థాయికి విబేధాలు..

కంటోన్మెంట్ బోర్డులో కీలక నేతలైన, పాలక మండలి మాజీ ఉపాధ్యక్షులు నలుగురు బీజేపీలో చేరారు. ముందుగా భానుక నర్మద మల్లీకార్జున్ బీజేపీ పార్టీలో చేరగా, అనంతరం జె. రామక్రిష్ణ, ఆ తర్వాత జంపన ప్రతాప్‌లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఇదే నెలలో ఈటల రాజేందర్‌తో పాటు మరో మాజీ ఉపాధ్యక్షుడు సాదా కేశవరెడ్డి సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే, కీలకమైన నేతలంతా బీజేపీలోకి వెళ్లినా.. కమలం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ నలుగురు మాజీ ఉపాధ్యక్షుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.

ఒకరితో ఒకరు కలిసి పనిచేసే వాతావరణమే కరువైంది. ప్రజా సమస్యలపై మూకుమ్మడి పర్యటనలు చేపట్టాల్సిన నేతలు.. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా తయారయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడి ప్రజలకు ఉచితంగా తాగు నీరు అందిస్తున్నా.. కంటోన్మెంట్‌లో ఉచిత నీరు పథకాన్ని అమలు చేయకున్నా పట్టనట్టే ఊరుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చకున్నా.. పట్టించుకోవడంలేదు. మొక్కుబడిగా కొన్ని ప్రకటనలు విడుదల చేయడానికే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సమస్యల విషయంలోనూ..

బాపూజీనగర్‌లో ఓపెన్ నాలాలో పడి.. ఆనంద్ సాయి అనే బాలుడు చనిపోయినప్పుడు కూడా బీజేపీ నాయకులంతా ఐకమత్యంగా పోరాటం చేసి బాలుడి కుటుంబానికి న్యాయం చేయలేదన్న విమర్శ ఉంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద భర్త భానుక మల్లీకార్జున్ మాత్రమే బాలుడి విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మల్లారెడ్డి గార్డెన్స్‌లో మంత్రి మల్లారెడ్డి సోదరుడు నర్సింహా రెడ్డి పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ.. పోలీసులకు పట్టుబడితే మాజీ ఉపాధ్యక్షుడు జె. రామక్రిష్ణ దోషులను శిక్షించాలని ఆందోళన చేపట్టారు.

అదేవిధంగా బేగంపేట ప్యాట్నీ నాలా అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గతంలో ప్రకటించి, హామీని అమలు చేయకపోవడంతో.. శుక్రవారం రామక్రిష్ణ ఒక్కరే నాలా వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై స్పందించడంలో వైఫల్యం పక్కన బెడితే.. సొంత పార్టీ నేతలను అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో కూడా నాయకులు ఎవరూ కలిసి రావడంలేదు. ఇటీవల న్యూ బోయిన్‌పల్లిలోని చిన్న తోకట్టలో మాజీ ఉపాధ్యక్షుడు సాదా కేశవరెడ్డికి చెందిన ప్లాట్‌లో అధికార యంత్రాంగం కూల్చివేతలు చేపట్టినా.. మిగితా ముగ్గురిలో ఏ ఒక్క ఉపాధ్యక్షుడు కనీసం పరామర్శించలేదు. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఈ పరిస్థితిలో.. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహారించాలనే బీజేపీ వైఖరీలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నలుగురు మాజీ ఉపాధ్యక్షులు తలోదారిన నడిస్తే ఆ పార్టీకి భవిష్యత్త్‌లో మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News