కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యానికి ముప్పు !

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ పాలన, మాఫియా సంస్కృతి పెరిగిపోయిందని, దీనికి చరమగీతం పాడినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని లోక్ తాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు రఘు ఠాకూర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయినందున సంపన్నులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారని, పేదోళ్ళకు అవకాశం లభించడం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్, విదేశీ బహుళజాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతోందని, ప్రపంచీకరణ విధానాలతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని అన్నారు. దివంగత నేత నాయిని […]

Update: 2020-11-09 11:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ పాలన, మాఫియా సంస్కృతి పెరిగిపోయిందని, దీనికి చరమగీతం పాడినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని లోక్ తాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు రఘు ఠాకూర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయినందున సంపన్నులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారని, పేదోళ్ళకు అవకాశం లభించడం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్, విదేశీ బహుళజాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతోందని, ప్రపంచీకరణ విధానాలతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని అన్నారు. దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సోమవారం జరిగిన ‘సోషలిజం – ప్రాసంగికత’ అనే అంశంపై ఆయన చేసిన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యంలో చట్టసభలకు పోటీచేసే హక్కు సంపన్నులకు, పేదవారికి సమానంగా ఉండాలని, అది సాధ్యం కావాలంటే తొలుత రాజకీయ పార్టీలు తమను తాము నియంత్రించుకోవాలన్నారు. ప్రస్తుతం పార్టీలలో అంతరంగిక ప్రజాస్వామ్యం కనుమరుగైందని, అధిష్టానం తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయని, ఇది నియంతృత్వానికి నిదర్శనమని అన్నారు. పార్టీలో సమిష్టి నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపికైన జరగాలని, కానీ ప్రజలతో, నియోజకవర్గాలతో సంబంధంలేనివారు నాలుగు గోడల మధ్య కూర్చుని నిర్ణయిస్తున్నారని అన్నారు. దేశంలో దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ పెత్తనం ఉందని, జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీలో కూడా సంఘ పరివార్ ప్రాబల్యమే ఉందని, సీనియర్ నేతల రెండో తరం కూడా వారసత్వ రాజకీయంగా వస్తున్నారని గుర్తుచేశారు.

ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ వికసిస్తేనే దాన్ని అభివృద్ధిగా పరిగణిస్తామని నొక్కిచెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక విధానాలు దేశానికి నష్టదాయకమన్నారు. సిద్దాంతాల పునాదిగా పరిపాలన సాగితేనే ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధ్యమని, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలు ప్రస్తుతం దేశానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రభుత్వాలు ఒకవైపు జాతీయవాదం గురించి చెప్తూనే మరోవైపు విదేశీ వస్తువులను, మార్కెట్లను ప్రోత్సహిస్తున్నాయన్నారు. టీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రజలు రాష్ట్ర సాధన కోసం పోరాడారని అన్నారు. రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఆ ఆకాంక్షలేవీ కనబడటం లేదన్నారు. కార్యక్రమంలో గాదె ఇన్నయ్య, లాంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు శేషురాం నాయక్ పాల్గొన్నారు.

Tags:    

Similar News