తెలంగాణలో త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి భూముల అక్షాంశ, రేఖాంశాలు నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయభూముల క్రయవిక్రయాలు పూర్తి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని చెప్పారు. గురువారం ప్రగతిభవన్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రెవెన్యూశాఖ పేరు మారుస్తామని, అధికారులు, ఉద్యోగుల జాబ్ చార్జ్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ అధికారుల సేవలను అవసరం ఉన్న చోట ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు. దిశ, […]
రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి భూముల అక్షాంశ, రేఖాంశాలు నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయభూముల క్రయవిక్రయాలు పూర్తి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని చెప్పారు. గురువారం ప్రగతిభవన్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రెవెన్యూశాఖ పేరు మారుస్తామని, అధికారులు, ఉద్యోగుల జాబ్ చార్జ్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ అధికారుల సేవలను అవసరం ఉన్న చోట ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు.
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లుగా డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో రూపొందించిన ధరణి పోర్టల్ విజయవంతమైందని సీఎం వెల్లడించారు. నూతన సంస్కరణలతో రెవెన్యూశాఖలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులపై జాబ్ చార్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు. రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పని తీరుపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు ప్రకటించారు. ‘ధరణి‘ పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమైందని, రైతులకు న్యాయం జరిగిందని చెప్పారు. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందని. జుట్టుకు జుట్టుకు మూడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయానికి తెరపడిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయన్నారు. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని చెప్పారు. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నదని, వాటిని మాత్రమే వారసత్వం, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో ధరణిలో ఎవరూ మార్పు చేసే అవకాశం ఉండదని చెప్పారు. అంతా సిస్టమ్ డ్రివెన్(వ్యవస్థానుగత) పద్దతిన, హ్యూమన్ ఇంటర్ఫేస్(మానవ ప్రమేయం) లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నదన్నారు.
చాలా మందికి మింగుడు పడడం లేదు
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొంత మందికి మింగుడు పడడం లేదని సీఎం కేసీఆర్మండిపడ్డారు. ధరణి పోర్టల్ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారని, అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నారన్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి ప్రజలు తికమక పడొద్దని చెప్పారు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలని సూచించారు.
సంస్కరణలే పరిష్కార మార్గం
‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల భూసంబంధిత సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని తెలిపారు. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారమవుతాయని చెప్పారు. తాను అసెంబ్లీలో ఇంతకు ముందే ప్రకటించినట్టుగానే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తామని, వాటిని ఎవరూ మార్చలేరన్నారు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదని. నిజానికి ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సిందని. కరోనా వల్ల ఆగినట్లు చెప్పారు.
అటవీ భూములపై స్పష్టత
రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీలు కూడా డిజిటల్సర్వే ద్వారా పరిష్కారమవుతుందని సీఎం స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మూడు నాలుగు నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయని. కో ఆర్డినేట్స్ మారవు. భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదన్నారు. భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జీడీపీ 3 నుంచి 4 శాతం మేర వృద్ధి సాధించిందని చెప్పారు. తెలంగాణలోనూ అలాంటి విప్లవాత్మక మార్పునకు ప్రభుత్వం సిద్ధపడిందని వివరించారు.
’రెవెన్యూ‘ మారుద్దాం
గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయని సీఎం ప్రస్తావించారు. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నదని అన్నారు. రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదు. పేరు మార్చే అవకాశం ఉందని చెప్పారు. ధరణి పోర్టల్, డిజిటల్ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయన్నారు. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదన్నారు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యమని, రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యమని చెప్పారు. రెవెన్యూ శాఖలో ఎవరేం పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుందన్నారు. రెవెన్యూ అధికారుల సేవలను అవసరం ఉన్న చోట ప్రభుత్వం వినియోగించుకుంటుందని కేసీఆర్ చెప్పారు. ఇకపై రైతులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. కలెక్టర్లు వాటిని స్వీకరించి, పరిశీలించాలని, సీఎస్ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.