త్వరలో నూతన వ్యవసాయ విధానం
– ఏ కాలంలో ఏ పంట వేయాలి? – ఎరువుల, రసాయనాల వాడకం ఎలా ఉండాలి ? – మే 5కల్లా నివేదిక ఇవ్వండి – అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు, మార్కెట్లో డిమాండు, రైతులు సాగుచేసే మెలకువలు తదితర అంశాల్లో తగిన మార్గదర్శకం చేసేలా నూతన వ్యవసాయ విధానం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం నిశితంగా అధ్యయనం చేసి వచ్చే నెల 5వ తేదీకల్లా […]
– ఏ కాలంలో ఏ పంట వేయాలి?
– ఎరువుల, రసాయనాల వాడకం ఎలా ఉండాలి ?
– మే 5కల్లా నివేదిక ఇవ్వండి
– అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు, మార్కెట్లో డిమాండు, రైతులు సాగుచేసే మెలకువలు తదితర అంశాల్లో తగిన మార్గదర్శకం చేసేలా నూతన వ్యవసాయ విధానం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం నిశితంగా అధ్యయనం చేసి వచ్చే నెల 5వ తేదీకల్లా నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ”తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు. ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. స్థానిక వనరులకు అనుగుణంగా రైతులు ఎవరికి తోచినట్లు వారు పంట సాగుచేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల ధరలు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారుతోంది. ప్రతీ మూలకూ సాగునీరు అందుతున్నది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నది. కాబట్టి రైతులను సరిగ్గా నిర్దేశించగలిగితే వ్యవసాయం లాభదాయకమవుతుంది. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగ్‌లో మార్పులు వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలని, అప్పుడే అన్ని పంటలకు డిమాండ్ ఉంటుందని, రైతులు తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, అధిక ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలని, ఈ మేరకు వారికి అవగాహన కలిగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, కందులు, పామాయిల్ లాంటి పంటలను గుర్తించాలని, దానికి అనుగుణంగా ఎన్ని ఎకరాల్లో పండించాలో స్పష్టత రావాలన్నారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉందని, అవి ఏ మోతాదులో పండించాలనే విషయంపై కూడా అధ్యయనం జరగాలన్నారు. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్‌ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలని సూచించారు. ఎరువుల వాడకంలో ఎలాంటి మార్పులు అవసరమో కూడా అధ్యయనం చేసి మే5లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేయాలని, వరిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేసే విధంగా రైతులను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కువగా వరిని పండిస్తున్నారని, పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలవైపు రైతులు మొగ్గుచూపుతున్నారని, కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటున్నందున ఆ పంట పండించేలా ప్రోత్సహించాలని సూచించారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి సాగునీటి ఇబ్బందులు కూడా లేనందున రైతులకు అర్థం చేయించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ విశ్వ విద్యాలయం విసి ప్రవీణ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, హర్టికల్చర్ ఎండి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
tags: Telangana, Agriculture Policy, Fertilizer, Vegetables, Fruits, Paddy, Irrigation