హుజురాబాద్ బై పోల్.. KCR సభకు ప్లేస్ ఫిక్స్.. హరీష్ రావు ఫుల్ బిజీ
దిశ, హుజురాబాద్ : ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ హుజురాబాద్ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి రాక ఖాయం అయిపోయిన నేపథ్యంలో సభాస్థలిని ఎంపిక చేసే విషయంలో నేతలు నిమగ్నమయ్యారు. మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సతీష్ బాబు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు వేదిక ఏర్పాట్లను సమీక్షించారు. వ్యూహాత్మకంగా.. సీఎం సభా వేదికను ఏర్పాటు చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న పెంచికల్‌పేట గ్రామ […]
దిశ, హుజురాబాద్ : ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ హుజురాబాద్ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి రాక ఖాయం అయిపోయిన నేపథ్యంలో సభాస్థలిని ఎంపిక చేసే విషయంలో నేతలు నిమగ్నమయ్యారు. మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సతీష్ బాబు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు వేదిక ఏర్పాట్లను సమీక్షించారు.
వ్యూహాత్మకంగా..
సీఎం సభా వేదికను ఏర్పాటు చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న పెంచికల్‌పేట గ్రామ శివార్లలో సభ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎన్నికల కమిషన్ కొవిడ్ నిబంధనలు పాటించాలని బహిరంగ సభలకు, రోడ్ షోలకు నియోజకవర్గంలో అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో, హుజురాబాద్ పట్టణానికి ఐదు కిలోమీటర్లు, చివరి గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పెంచికల్‌పేటను ఎంచుకున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పలు సభలను ఇక్కడ ఏర్పాటు చేసింది. సీఎం బహిరంగ సభను కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అయింది. హుజురాబాద్ పరిధిలో అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది కానీ.. ఇరుగు పొరుగు నియోజకవర్గాల్లో అయితే ఇందుకు ఎలాంటి ఆస్కారం ఉండదని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం పెంచికల్‌పేటను ఎంచుకుంది.
ఎన్నికలిక్కడ.. ప్రచారం అక్కడ
ఉప ఎన్నికలు హుజురాబాద్‌లో జరుగుతున్నప్పటికీ హుస్నాబాద్ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కేసుల్లో ఇరుక్కోకుండా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీంతో పాటు సభా వేదిక ఖర్చులు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడవని కూడా అంచనా వేస్తున్నారు.
జెండాలు లేకుంటే సరి..
హుజురాబాద్ బై పోల్‌లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ పెంచికల్‌పేట సభతో పూర్తిస్థాయి పట్టు సాధించే దిశగా యోచిస్తోంది. సీఎం సభతో ఇక్కడి ఓటర్లలో తమకు అనుకూలత సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సీఎం ప్రసంగంతో తిరుగులేని పట్టు బిగించాలని సంకల్పిస్తోంది. అయితే, ఈ సభా వేదిక నిర్వహించడం వెనుక అసలు రహస్యం మాత్రం టీఆర్ఎస్ గెలుపెనన్నది స్పష్టం. పెంచికల్‌పేట సభకు సింహ భాగం జనాన్ని హుజురాబాద్ నుండే తరలించనున్నారు. జనాలను తరలించే వాహనాలకు పార్టీ జెండాలు లేకుండానే వారిని సభకు తీసుకువెళ్లనున్నట్టు సమాచారం. పార్టీ జెండాలు సరఫరా చేయకుండా కేవలం ప్రజలను తరలించి సఫలం అయ్యే యోచనలో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి.