అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్న సీఎం.. బిగుస్తున్న పట్టు
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పజెప్పడంపై ఎన్ని రకాల సెంటిమెంట్లు, అంచనాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటలతో పోరాడి ఓడినప్పటికీ ఇంతకాలం ఆయన నిర్వహించిన శాఖనే అప్పగించడం గమనార్హం. ఉప ఎన్నికలో ఈటలను ఓడించే బాధ్యతను అప్పజెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్య శాఖను కూడా అప్పగించారు. పార్టీకి ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ పోరాడి ఓడిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పజెప్పడంపై ఎన్ని రకాల సెంటిమెంట్లు, అంచనాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటలతో పోరాడి ఓడినప్పటికీ ఇంతకాలం ఆయన నిర్వహించిన శాఖనే అప్పగించడం గమనార్హం. ఉప ఎన్నికలో ఈటలను ఓడించే బాధ్యతను అప్పజెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్య శాఖను కూడా అప్పగించారు. పార్టీకి ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ పోరాడి ఓడిన నేతగానే సీఎం గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఆ శాఖను అప్పగించడం ఆయన పట్ల ఉన్న నమ్మకానికి, సమర్ధతకు నిదర్శనం అనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
దుబ్బాక తరహాలోనే హుజూరాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో రెండు చోట్లా బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్‌రావుకు పార్టీలో ఇకపై ప్రాధాన్యత తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం తీసుకున్న నిర్ణయం ఆయనకు పదోన్నతి, ప్రాధాన్యత కల్పించినట్లుగానే భావించాల్సి ఉంటుందని కొద్దిమంది నేతలు వ్యాఖ్యానించారు. ఈటలను మంత్రివర్గం నుంచి బహిష్కరించిన తర్వాత ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే చూసుకున్నారు. వరుస రివ్యూలు పెట్టారు. ఆ తర్వాత కొంతకాలం హరీశ్‌రావు పర్యవేక్షించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ శాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో తనదైన ముద్రను నెలకొల్పడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల హెడ్‌లతో వరుస సమీక్షలు బుధవారం మొదలుపెట్టారు. ఆ శాఖలోని సిబ్బందికి సంబంధించిన సమస్యలను మాత్రమే కాక దీర్ఘకాలంగా నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా దృష్టి సారించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా చాలా మంది ఓటర్లు, ప్రజలు కరోనా సమయంలో ఈటల చాలా సాయం చేశారంటూ బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ సానుభూతి కూడా ఓటర్లు ఆయనవైపు మొగ్గు చూపడానికి ఒక కారణమంటూ పార్టీలో ఒక వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు హరీశ్‌రావు ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
హుజూరాబాద్ ఓటమి తర్వాత హరీశ్‌రావు అప్రాధాన్యమైపోతారనే అంచనాలకు భిన్నంగా సీఎం తనదైన తీరులో నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డి విఫలమైనప్పటికీ కేసీఆర్‌కు ఆయన పట్ల సానుకూల అభిప్రాయమే ఉన్నదని ఈ నిర్ణయంతో తేలిపోయింది. పార్టీ అంటే ఈటల అనే స్థాయిలో ఉన్న ఆ నియోజకవర్గంలో పూర్తిగా గ్రౌండ్ జీరో నుంచి పార్టీ నిర్మాణం చేసి దాదాపు 83 వేల ఓట్లను సాధించే కృషిలో హరీశ్‌రావుదే కీలకమైన పాత్ర అని సీఎం భావించినట్లు తెలిసింది. పోయినచోటనే వెదుక్కోవాలనే తీరులో హరీశ్‌రావు ద్వారా సీఎం కేసీఆర్ వైద్యారోగ్య శాఖను గాడిలో పెట్టే పని మొదలుపెట్టారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఉల్లంఘనలతోపాటు పెండింగ్ పనులను కూడా సత్వరం పూర్తి చేసి అప్పటికంటే మంచి గుర్తింపు తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశమనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు ఉదహరించాయి.
కొత్త వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు, నర్సింగ్ విద్యా సంస్థలను నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేసే టాస్కును హరీశ్‌రావు చేపట్టారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం త్వరలో తనిఖీలు చేపట్టి కళాశాల భవనాలు, అందులో సిద్ధం చేసిన మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది తదితరాలను పరిశీలించనున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించారు.