రాజధాని విషయంలో తగ్గేదేలే అంటున్న జగన్.. లీకులిస్తున్న మంత్రులు..
దిశ, ఏపీ బ్యూరో: ఎవరెన్ని ఊహాగానాలు చేసినా జగన్ సర్కార్ మాత్రం పాలనా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతోంది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నట్లు కనపడినా అది కేవలం న్యాయపరమైన చిక్కుల నుంచి బయట పడటానికే అని అర్థమైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినట్టుగానే మరో సమగ్రమైన స్పష్టతతో కూడిన 3 రాజధానుల బిల్లుకు రూపకల్పన జరుగుతోంది. మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఈసారి […]
దిశ, ఏపీ బ్యూరో: ఎవరెన్ని ఊహాగానాలు చేసినా జగన్ సర్కార్ మాత్రం పాలనా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతోంది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నట్లు కనపడినా అది కేవలం న్యాయపరమైన చిక్కుల నుంచి బయట పడటానికే అని అర్థమైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినట్టుగానే మరో సమగ్రమైన స్పష్టతతో కూడిన 3 రాజధానుల బిల్లుకు రూపకల్పన జరుగుతోంది. మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధమైంది.
ఈసారి అమరావతికి మాత్రం రాబోయే కొత్త బిల్లులో సముచిత స్థానం కల్పించనున్నట్టు సమాచారం. న్యాయపరంగా ఎలాంటి లొసుగులు లేకుండా ఈ బిల్లును తీసుకురానున్నారు. మూడు రాజధానుల బిల్లులో ఉన్న సాంకేతిక సమస్యల దృష్ట్యా మాత్రమే పాత బిల్లును రద్దు చేశారనే స్పష్టత దీంతో వచ్చినట్టయింది.
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. అయితే డిజైన్ల రూపకల్పన అంటూ తాత్సారం చేయడం, కేంద్రం నుంచి సరైన స్థాయిలో నిధులు రాబట్టుకోవడంలో విఫలం చెందడంతో 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరగలేదు. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక ఏపీకి మూడు రాజధానులు అంటూ సెన్సేషన్ సృష్టించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఆరునూరైనా మూడు రాజధానులు..
మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నప్పుడే ఇది ఇంటర్వెల్ మాత్రమే అని, ఇంకా శుభం కార్డు పడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తమ నాయకుడు జగన్ ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వెయ్యరంటూ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ తర్వాత సీఎం కూడా సమగ్రమైన మరో బిల్లును తెస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఆ బిల్లు ఎలా ఉంటుంది, ఎప్పుడు తెస్తారు అనే దానిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ తాజా సమాచారం మేరకు వచ్చే మార్చిలో జరిగే బడ్జెట్ సెషన్‌లో ఈ బిల్లు సభ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
బిల్లులో ఎలాంటి అంశాలుంటాయి?
ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన బిల్లులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానిపై ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నమే అనేది అనధికారిక సమాచారం. అయితే అమరావతికి మాత్రం గత బిల్లుతో పోలిస్తే మరింత సముచిత స్థానం కల్పించడంతో పాటు భూములిచ్చిన రైతులకు మరింత భరోసా కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమతో సహా అన్ని ప్రాంతాల వారి డిమాండ్లనూ దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన బిల్లు రూపొందుతున్నట్టు సమాచారం.
ఏదేమైనా పాత బిల్లు రద్దైన నాలుగు నెలల్లోనే కొత్త బిల్లు రెడీ చేస్తున్నారనే సమాచారం చూస్తుంటే ఈ అంశంపై కసరత్తు చాలాకాలం క్రితమే మొదలైనట్టు తెలుస్తోంది. పైగా శాసనసభతో పాటు ప్రస్తుతం శాసనమండలిలో సైతం అధికార వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉండడంతో కొత్త బిల్లు ఆమోదం పొందడం కూడా ప్రభుత్వానికి అతి సులువు అవుతుంది.