అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన స్టార్ సింగర్.. కుట్రపూరితంగా ఇరికించారంటూ..
సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్ గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉన్నారు. అయితే నిన్న ఉదయం బన్నీ జైలు నుంచి విడుదల అయ్యారు.
దీంతో అతన్ని కలవడానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఓ స్టార్ సింగర్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఐకాన్ స్టార్‌ను అరెస్ట్ చేయడంపై ప్రముఖ సింగర్ కల్పన మండిపడ్డారు. ‘ఆయన నేషనల్ అవార్డు పొందిన యాక్టర్. బెడ్ రూంలోకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా..? బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. ఉద్దేశపూర్వకంగా ఘటనకు పాల్పడనప్పుడు ఆయనపై ఈ సెక్షన్లు ఏంటీ..? అక్కడ జరిగిన ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఎవరైనా వెళ్లి కొట్టారా..? లేదా ఏదైనా ఆయుధం వాడారా..? అసలు ఈ కఠిన సెక్షన్లు బన్నీపై ఏంటి..? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి.