Deepika Padukone: వారానికి 90 గంటలు పని.. క్లారిటీ ఇచ్చి మరీ దిగజారారంటూ దీపిక పదుకొనె సంచలన పోస్ట్
వారానికి 90 గంటల పాటు పని చేయాలని, అలాగే ఆదివారం సైతం పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: వారానికి 90 గంటల పాటు పని చేయాలని, అలాగే ఆదివారం సైతం పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఈ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా స్పందించింది. ఈ మేరకు అసహనం వ్యక్తం చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టింది. అలాగే చైర్మన్ కామెంట్స్ పై ఆ కంపెనీ ఇచ్చిన వివరణపై కూడా ఆమె మరో పోస్ట్ పెట్టింది.
‘ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా’ అని రాసుకొచ్చింది. అలాగే తన పోస్ట్‌కు #mentalhealthmatters అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇవ్వగా.. దానిపైన కూడా ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ.. ‘ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ భామ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైర్మన్ వ్యాఖ్యలపై కంపెనీ వివరణ:
ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ సృష్టతనిచ్చింది. ‘ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్ అండ్ టీ ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్ అండ్ టీ మెరుగు పరిచింది. అభివృద్ధి చెందిన దేశమంతటా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ విస్తృత లక్ష్యాన్నే చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయి’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.