తాలిబన్లతో సమావేశమైన సీఐఏ డైరెక్టర్
దిశ వెబ్‌డెస్క్: సీఐఏ చీఫ్ విలియం బర్న్ మంగళవారం తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్‌తో సమావేశమైనట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితమే ఆప్ఘాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ఆగష్టు 31 తో సాధ్యం కాదని, గడువును పెంచమని తాలిబన్లను కోరారు. అయితే దీనికి వారు ససేమిరా అనటంతో సీఐఏ అధ్యక్షుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. […]
దిశ వెబ్‌డెస్క్: సీఐఏ చీఫ్ విలియం బర్న్ మంగళవారం తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్‌తో సమావేశమైనట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితమే ఆప్ఘాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ఆగష్టు 31 తో సాధ్యం కాదని, గడువును పెంచమని తాలిబన్లను కోరారు.
అయితే దీనికి వారు ససేమిరా అనటంతో సీఐఏ అధ్యక్షుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలను ఇరుపక్షాలు వెల్లడించలేదు. పెంటగాన్ నివేదిక ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 16 వేల మందిని అమెరికా తన దేశానికి తరలించింది. ఇదే అంశంపై మంగళవారం బ్రిటన్ ఆధ్వర్యంలో నిర్వహించే పారిశ్రామిక దేశాల అభివృద్ధి కూటమి( జీ7) చర్చించనుంది. ఈ దేశాల అధినేతలందరూ వర్చువల్‌గా సమావేశమవుతున్నారు.
మధ్యవర్తిత్వానికి సిద్ధం: రష్యా
రష్యా, చైనా, అమెరికా, పాకిస్తాన్ కలిసి ఆప్ఘాన్‌లో సుస్థిరత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మధ్యవర్తిత్వం కోసం సిద్ధంగా ఉన్నాయంటూ మాస్కో ప్రకటించింది. కాబూల్‌లో కల్లోల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమకు భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని మాస్కో ఆందోళన చెందుతోంది. దాంతో మధ్య ఆసియా దేశాలకు ఆప్ఘాన్ శరణార్ధులు రావటాన్ని రష్యా తప్పుపట్టింది. ఆ దేశాలలో మత చాంధసవాదం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వెంటనే ఆయా దేశాల సరిహద్దులను పటిష్టం చేయాలని కోరింది. ఇవన్నీ ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగం కావటంతో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరో వైపు కాబూల్‌లో పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. రెండు దశాబ్ధాల నుంచి లక్షలాది డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఇప్పుడు అర్ధాంతరంగా వెనుతిరిగి వెళ్లాల్సి రావటంతో వారంతా మధన పడుతున్నారని సమచారం. తాలిబన్లతో కలిసి పనిచేయాలా? లేక తిరిగి తమ పెట్టుబడిని అలాగే వదిలేసి వెళ్లిపోవాలా? అంటూ ఆలోచిస్తున్నాయని అల్‌జజీరా వెల్లడించింది. ఒకవేళ భవిష్యత్‌లో పశ్చిమ దేశాలు తాలిబన్లపై ఆంక్షలు విధిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నాయని తెలుస్తోంది.