రాజధాని, పోలవరానికి ముక్తి దొరుకుతుందా?
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అంటూ హస్తినకు బయల్దేరారు. తరువాత అమిత్ షాతో భేటీ కోసం మరోమారు ఆయన ఢిల్లీ వెళ్లారు. చివరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన బిజీగా మారిపోయారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలిలో కొర్రీ పడడంతో దానికి మోక్షం కల్పించాలని ఆయన […]
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అంటూ హస్తినకు బయల్దేరారు. తరువాత అమిత్ షాతో భేటీ కోసం మరోమారు ఆయన ఢిల్లీ వెళ్లారు. చివరి నిమిషంలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన బిజీగా మారిపోయారు.
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలిలో కొర్రీ పడడంతో దానికి మోక్షం కల్పించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శాసన మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో శాసనసభ కార్యదర్శికి లేఖరాశారు. దానిని ఆయన తిప్పి పంపడంతో వివాదం కొత్త మలుపుతీసుకుంది. టీడీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై అథ్యయనం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. మరోవైపు అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయాన్ని కూడా ఆయనతో చర్చించనున్నారు. శాసనమండలి రద్దుతో పాటు, హైకోర్టు, ఇతర శాఖల తరలింపుకు అనుమతివ్వాలని ఆయనను కోరనున్నారు.
మరోవైపు కేంద్ర జలనవరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో పురోగతితో పాటు నిధుల జాప్యంపై ఆయనతో చర్చించనున్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ బిల్లుననుసరించి దానిని పూర్తి చేయాల్సిన బాధ్యతను వివరించనున్నారు. అలాగే పోలవరం నిర్వాసితులకు అందాల్సిన పరిహారం.. ఒడిశా చెబుతున్న అభ్యంతరాలకు సంబంధించిన అనుమతులు వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన షెకావత్‌తో చర్చిస్తారు.
ఈ సమావేశాల్లో జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ముగ్గురితో కలిసి జగన్ సమావేశం కావడం పట్ల వైఎస్సార్సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కీలక నేతలతో సమావేశాల కారణంగా పెండింగ్ పనులు, నిధులకు లైన్ క్లియర్ అవుతుందని వారు భావిస్తున్నారు.