జగన్ ప్రభుత్వ తీరుపై బాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సమరం తారస్థాయికి చేరుకుంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ స్థానిక ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. 40 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో రాజశేఖర్‌రెడ్డితో పాటు చాలా మంది రౌడీలను చూశానని అన్నారు. వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు తాను బెదిరే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. మాచర్లకు ఎవరూ పోకూడదా? ఇది (మాచర్ల) పాకిస్థానా? […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సమరం తారస్థాయికి చేరుకుంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ స్థానిక ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. 40 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో రాజశేఖర్‌రెడ్డితో పాటు చాలా మంది రౌడీలను చూశానని అన్నారు.
వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు తాను బెదిరే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. మాచర్లకు ఎవరూ పోకూడదా? ఇది (మాచర్ల) పాకిస్థానా? వీసా కావాలా? మీ తాత జాగీరా? అంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో ఏ ఊరికి ఎవరూ పోకూడదా? తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల పోవాలంటే ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా? పిచ్చి పట్టిందా? కొవ్వు పట్టిందా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. మూడు కార్లలో తమ వాళ్లు మాచర్లకు వెళ్తే, అయితే పది కార్లలో వచ్చారని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బుద్ధి ఉన్నోడెవడైనా ఈ మాట చెబుతారా? అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఆంబోతుల మాదిరి రోడ్డు మీద పడి ఇష్టానుసారం చేస్తే మేము భయపడాలా? సరెండర్ కావాలా? ఏకగ్రీవంగా మీకు వదిలిపెట్టాలా? అంటూ బాబు నిప్పులు చెరిగారు.
అధికార, వాలంటీర్ల వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైతే వైసీపీ నేతలు ఓడిపోతామనుకుంటున్నారో అక్కడ ఎన్నిక నిలిపివేస్తున్నారని, వారి ఇష్టానుసారం ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ నాయకులు పేట్రేగిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ నాలుగు వందలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో విపక్షాల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా చేశారని మండిపడ్డారు. ఏయే స్థానాల్లో అయితే ఏకగ్రీవం చేసుకున్నారో, అవన్నీ రీ– షెడ్యూల్ చేయాలని, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.
అంతవరకూ వదలిపెట్టమని, అవసరమైతే, చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని, రాజకీయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆటలు సాగనివ్వమని ఆయన సవాలు విసిరారు. ప్రజాస్వామ్యమంటే తమాషా అనుకోవద్దని, దుర్మార్గంగా వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారని ఆయన వారికి వార్నింగ్ ఇచ్చారు.
tags : tdp, ysrcp, local body elections, chandrababu, macherla incident, babu on elections, babu on fire