జమ్ము కశ్మీర్ కు కొత్త 'ముల్కీ' నిబంధనలు

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే 370, 35ఏ అధికరణలు రద్దు చేసిన సుమారు ఎనిమిది నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీరీల స్థానికతను నిర్ధారించే కొత్త నిబంధనలను రూపొందించింది. పదిహేనేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ లో నివసిస్తున్న వారిని స్థానికులుగా పరిగణించవచ్చునని తెలిపింది. కశ్మీరీ స్థానికతను నిర్వచించేందుకు సెక్షన్ 3ఏను ప్రవేశపెడుతూ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 15 సంవత్సరాలుగా […]

Update: 2020-04-01 08:10 GMT

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే 370, 35ఏ అధికరణలు రద్దు చేసిన సుమారు ఎనిమిది నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీరీల స్థానికతను నిర్ధారించే కొత్త నిబంధనలను రూపొందించింది. పదిహేనేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ లో నివసిస్తున్న వారిని స్థానికులుగా పరిగణించవచ్చునని తెలిపింది. కశ్మీరీ స్థానికతను నిర్వచించేందుకు సెక్షన్ 3ఏను ప్రవేశపెడుతూ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం 15 సంవత్సరాలుగా జమ్ముకశ్మీర్ లో ఉంటున్నవారు లేదా ఆ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో ఏడేళ్లు చదువుకుని పదవ తరగతి, 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను కాశ్మీరీలుగా గుర్తించవచ్చు. అలాగే పదేళ్లుగా జమ్ము కశ్మీర్ లో సేవలందిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను జమ్ము కశ్మీర్ స్థానికులుగా పరిగణించవచ్చు. రిలీఫ్, రిహాబిలిటేషన్ కమిషనర్ (మైగ్రాంట్) ద్వారా గుర్తింపు పొంది జమ్ము కాశ్మీర్ లో ఉంటున్న శరణార్థులు కాశ్మీరీలుగా చెలామణి అవుతారు. సర్కారు పేర్కొన్న సెక్షన్లోని నిబంధనలకు లోబడిన పిల్లలందరూ కశ్మీరీలుగానే గుర్తించబడతారు. కశ్మీర్ స్థానికత నిబంధనలను సంతృప్తిపరిచిన కశ్మీరీలు.. ఉద్యోగ, వ్యాపార, ఇతర వృత్తి రీత్యా ఆ రీజియన్ బయట ఉన్నా.. వారి పిల్లలు కాశ్మీరీలుగానే గుర్తింపు పొందుతారు. ఈ నిబంధనలు పొందుపరిచే క్రమంలో 29 రాష్ట్ర చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేసింది. అలాగే 109 చట్టాలను సవరించింది.

పే స్కేల్ లెవెల్ 4 ఉద్యోగాలకే..

కేంద్రం ప్రతిపాదించిన ఈ నిబంధనలననుసరించి కశ్మీరీలుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే జూనియర్ పోస్టుల నియామకాలకు అర్హులు. పే స్కేల్ లెవెల్ 4 (వేతనం సుమారు రూ. 25 వేలు) ఉద్యోగాలకు జమ్ము కశ్మీర్ స్థానికులు మాత్రమే అర్హులని కేంద్రం పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం తక్కువ ర్యాంకింగ్ పొజిషన్స్ ఉదాహరణకు ప్యూన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్థానిక కశ్మీరీలు అర్హులవుతారు. ఆపై ఉద్యోగాలకు కశ్మీరేతరులూ అర్హులయ్యేలా స్థానికత నిబంధనలు ఉన్నాయి.

ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం కశ్మీరీల స్థానికత, స్థిరాస్తి హక్కులపై ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయాలు తీసుకునేది. అప్పుడు జమ్మూకాశ్మీర్లోని అన్ని ఉద్యోగాలకు స్థానికులు అర్హులుగా ఉండేవారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం పై విమర్శలు వస్తున్నాయి. ఈ చట్టంతో పే స్కేల్ లెవెల్ 4 కు పై ఉద్యోగాలకు కశ్మీరేతరులూ అర్హులవుతారు.

ఈ చట్టంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. కరోనా కష్టకాలంలో దానిపై పోరాటాన్ని వదిలి జమ్ము కాశ్మీర్ ముల్కీ నిబంధనల ముందుకు తెచ్చిందని విమర్శించారు. ఈ చట్టం కశ్మీరీలను అవమానపరుస్తున్నదని తెలిపారు. ఢిల్లీ ఆశీర్వాదంతో జమ్మూకాశ్మీర్లో ఏర్పాటైన కొత్త పార్టీ కూడా ఈ చట్టాన్ని విమర్శిస్తున్నదని ట్వీట్ చేశారు.

Tags: Jammu kashmir, domicile, new act, repeal, ut, omar Abdullah, recruitment

Tags:    

Similar News