కరోనా పేరుతో సాయం.. వడ్డీలతో మోసం..!

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కాలంలో ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం అడగకుండానే మహిళలకు రుణాలిచ్చింది. ఇప్పుడు వడ్డీతో కలిపి వసూలు చేస్తోంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన మహిళలపై వడ్డీ భారం మోపుతోంది. ఆ రుణాలకు వడ్డీ భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేమని స్పష్టం చేసింది. కరోనా రుణాలకు మాత్రం రూపాయి తిరిగి ఇవ్వమని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. కేంద్ర, […]

Update: 2021-03-08 09:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కాలంలో ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం అడగకుండానే మహిళలకు రుణాలిచ్చింది. ఇప్పుడు వడ్డీతో కలిపి వసూలు చేస్తోంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన మహిళలపై వడ్డీ భారం మోపుతోంది. ఆ రుణాలకు వడ్డీ భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేమని స్పష్టం చేసింది. కరోనా రుణాలకు మాత్రం రూపాయి తిరిగి ఇవ్వమని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటుండటంతో భారమంతా మహిళలపై పడుతోంది.

ఎందుకిచ్చారు…?

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో గత ఏడాది జూన్‌లో మహిళా సంఘాలకు కరోనా సాయం విడుదల చేశారు. వాస్తవంగా మహిళా సంఘాలు ఏ సాయాన్ని కోరలేదు. రాష్ట్రం నుంచి ఎలాంటి లేఖలు, వినతులు చేయలేదు. కానీ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 5 వేల చొప్పున సాయంగా ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి సంస్థతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ రుణాలను విడుదల చేయించారు. రాష్ట్రంలో 42 లక్షల మంది మహిళలకు రూ. 2,100 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. మహిళలకు కరోనా సాయమని చెప్పలేదు. వారి ఖాతాల్లో జమయ్యే వరకు ఇవి దేనికి సంబంధించినవో చెప్పలేదు. అయితే వడ్డీ రాయితీ కింద వచ్చిన సొమ్ముగా వారు భావించారు.

అది సాయం కాదు.. రుణం

కరోనా సాయంగా ఇచ్చిన రూ. 5 వేలు రుణాలుగా ఇచ్చామని బ్యాంకర్లు నోటీసులు పంపించారు. వీటిని 11.5 శాతం నుంచి 12.5 శాతం వడ్డీతో కలిపి ప్రతినెలా రూ. 550 చొప్పున చెల్లించాలని ఆదేశాలిచ్చారు. దీంతో చాలా మంది మహిళలు వ్యతిరేకించారు. అడుగకుండా ఎందుకు ఇచ్చారని, వీటిని వడ్డీతో కలిపి చెల్లించలేమంటూ బ్యాంకులకు చెప్పారు. అయితే బ్యాంకులు మాత్రం పొదుపు సొమ్ముతో ముడి పెట్టింది. ఈ రుణ వాయిదాలు వడ్డీతో కలిపి చెల్లిస్తేనే… పొదుపు సొమ్ము జమ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో మహిళలు గత నెల నుంచి వడ్డీతో కలిపి చెల్లింపులు చేస్తున్నారు.

నెలకు రూ. 265 కోట్ల వడ్డీ

కరోనా కాలంలో డీలాపడ్డ బ్యాంకులు.. మహిళలకు రుణాలిచ్చి వడ్డీ వ్యాపారం పెంచుకుంటోంది. బ్యాంకులకు దోచిపెట్టేందుకే కరోనా సాయం పేరిట రుణాలిచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 42 లక్షల మంది మహిళలు ప్రతినెలా రూ. 265 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారు.

Tags:    

Similar News