CUET UG 2024 రిజిస్ట్రేషన్ గడువు తేది పొడిగింపు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష - UG (CUET UG 2024) కోసం దరఖాస్తు చివరి తేదీని 5 రోజులు పొడిగించింది.
దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష - UG (CUET UG 2024) కోసం దరఖాస్తు చివరి తేదీని 5 రోజులు పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు మార్చి 31 రాత్రి 10 గంటలలోపు నమోదు చేసుకోవచ్చు. ఇంతకుముందు దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 కాగా ఇప్పుడు దానిని పొడిగించారు. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీష్ కుమార్ ప్రకటించారు.
ఈ పరీక్షను మే 15 నుంచి మే 31, 2024 వరకు దేశవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో NTA నిర్వహిస్తుంది. పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. CUET UG 2024 అడ్మిట్ కార్డ్ మే రెండో వారంలో విడుదల చేయనున్నారు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత, నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ, BHU, JNUతో సహా వివిధ కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల UG ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – Exams.nta.ac.in/CUET-UG/
హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ అవసరమైన వివరాలను నమోదు చేయండి.
ఇప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపి వివరాలను నమోదు చేయండి.
పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించిన తర్వాత సమర్పించండి.
CUET UG 2024 లో అప్లై చేయాలంటే అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గాలకు చెందిన అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు NTA ద్వారా ముందుగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.