సింగ‌రేణి ఉద్యోగుల‌కు గంజాయి..?

దిశ, కొత్తగూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గంజాయి వ్యాపారస్తులు రహస్యంగా తమ దందా కొనసాగిస్తున్నారు. యువతనే టార్గెట్‌గా చేసుకుని ప‌ట్ట‌ణంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఒడిషా, చ‌త్తీస్‌గ‌డ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అర‌కు, విశాఖ జిల్లాల నుంచి ఇక్కడికి గంజాయి రవాణా అవుతోంది. గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏజెన్సీ మండ‌లాలైన చ‌ర్ల, వెంక‌టాపురం, గుండాల లాంటి అట‌వీ ప్రాంతాల్లో కొంత‌ మంది […]

Update: 2020-06-25 20:02 GMT

దిశ, కొత్తగూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గంజాయి వ్యాపారస్తులు రహస్యంగా తమ దందా కొనసాగిస్తున్నారు. యువతనే టార్గెట్‌గా చేసుకుని ప‌ట్ట‌ణంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఒడిషా, చ‌త్తీస్‌గ‌డ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అర‌కు, విశాఖ జిల్లాల నుంచి ఇక్కడికి గంజాయి రవాణా అవుతోంది. గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏజెన్సీ మండ‌లాలైన చ‌ర్ల, వెంక‌టాపురం, గుండాల లాంటి అట‌వీ ప్రాంతాల్లో కొంత‌ మంది స్వ‌యంగా సాగు చేసి భ‌ద్రాచ‌లం మార్గం గుండా కొత్త‌గూడెం జిల్లా కేంద్రానికి చేరుస్తున్నారు.

రహస్యంగా అమ్మకాలు

కేజీ గంజాయిని రూ.12వేల నుంచి రూ.15వేల మ‌ధ్య విక్ర‌యిస్తున్న‌ట్టు సమాచారం. కొత్త‌గూడెంలోని సుమారు 35 మందికి పైగా స‌రుకు అందుతోందని తెలుస్తోంది. 35మందిలో కొంత‌ మంది రహస్యంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుని స‌రుకును నేరుగా యువ‌త‌కు, సింగ‌రేణి ఉద్యోగుల‌కు విక్ర‌యిస్తున్నారు. ఇంకొంత‌మంది మాత్రం నిల్వ ఉంచి రూ.వెయ్యికి మించిన ఆర్డ‌ర్ల‌కు మాత్ర‌మే నేరుగా వెళ్లి గంజాయిని అందజేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్ బస్తీ, హనుమాన్ బస్తీ, రామవరం, రుద్రంపూర్, సింగ‌రేణి మేయిన్ హాస్పిట‌ల్‌లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని మ‌రీ విక్ర‌యిస్తున్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు అత్యంత స‌మీపంలోనే ఓ మ‌హిళ చిన్న గుడారాన్ని ఏర్పాటు చేసుకుని విక్ర‌యాలు జ‌రుపుతున్న‌ట్టు సమాచారం. కేటీపీఎస్ ఉద్యోగులు ఎక్కువ‌గా ఉండే పాల్వంచలోనూ గంజాయి విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి.

కిలోల్లో కొనుగోలు.. గ్రాముల్లో విక్రయాలు

అమ్మకదారులు గంజాయిని ఏజెన్సీ వాసుల నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి గ్రాముల లెక్క‌న కస్టమర్లకు విక్ర‌యిస్తున్నారు. రూ.50కు ఒక‌ గంజాయి ప్యాకెట్ విక్ర‌యిస్తున్న‌ట్టు సమాచారం. కొందరు సిగ‌రెట్‌లోని పొగాకులో గంజాయి పొడిని మిక్స్ చేసుకుని సేవిస్తున్నారు. ఇలా సేవించిన మ‌త్తు కొత్త‌వారికైతే రోజంతా.. అల‌వాటు ప‌డిన వారిలో 5గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల సింగ‌రేని మేయిన్ ఆస్ప‌త్రి ప్రాంతాల్లో గంజాయి సేవించిన అనంత‌రం రెండు గ్యాంగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తలెత్తింది. ఇందులో కొంత‌మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ సైతం నిర్వ‌హించారు.

ఆవారాలే ఎక్కువ..

గంజాయికి అల‌వాటుప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా ఆవారాగా తిరుగుతున్న వారే ఉన్నారు. వారితో పాటు చ‌దువుకుంటున్న యువ‌త‌, సింగ‌రేణిలోని కాంట్రాక్టు సిబ్బంది సైతం ఉండటం గ‌మ‌నార్హం. ఇందులో యువ‌త త‌మ‌ జ‌ల్సాల‌ను తీర్చుకోవ‌డానికి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు సైతం వెలుగు చూస్తున్నాయి.

పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాలి: ఎస్పీ సునీల్ దత్, కొత్తగూడెం

ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు నుంచి జిల్లాకు తరలివస్తున్న గంజాయిని ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో పట్టుకుంటున్నాం. తల్లితండ్రులు సైతం వారి పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలి. గంజాయి సరఫరా చేసే ముఠాలు మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిని కట్టడి చేస్తూ ఎప్పుడు కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.

Tags:    

Similar News