వారి శృంగారాన్ని రేప్ అనవచ్చా?: సుప్రీం
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు భార్య, భర్తలుగా కలిసున్నప్పడు వారిద్దరి శారీరక సంబంధాన్ని లైంగికదాడిగా పరిగణించవచ్చునా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లు సహజీవనం చేసిన తర్వాత తనపై లైంగికదాడి కేసు పెట్టిందని యూపీకి చెందిన వినయ్ ప్రతాప్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ ప్రశ్నను లేవనెత్తింది. తనతో రెండేళ్లు సహజీవనంలో ఉండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశారని, తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నారని సదరు మహిళ వినయ్‌పై కేసు పెట్టింది. పెళ్లి […]
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు భార్య, భర్తలుగా కలిసున్నప్పడు వారిద్దరి శారీరక సంబంధాన్ని లైంగికదాడిగా పరిగణించవచ్చునా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లు సహజీవనం చేసిన తర్వాత తనపై లైంగికదాడి కేసు పెట్టిందని యూపీకి చెందిన వినయ్ ప్రతాప్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ ప్రశ్నను లేవనెత్తింది. తనతో రెండేళ్లు సహజీవనంలో ఉండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశారని, తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నారని సదరు మహిళ వినయ్‌పై కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని అబద్దపు హామీనివ్వడం కచ్చితంగా తప్పేనని, మహిళ అయినా, పురుషుడైనా అలాంటి హామీలనివ్వరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు.
‘ఒక పురుషుడు, ఒక మహిళ భార్య భర్తలుగా కలిసుంటున్నప్పుడు, అందులో కొంత వంచన ఉన్నప్పటికీ, పురుషుడు కటువుగా, తప్పుగా ప్రవర్తించినప్పటికీ, వారిద్దరి మధ్య శృంగారాన్ని రేప్‌గా పరిగణించవచ్చునా?’ అని ప్రశ్నించారు. తాము ఇరువురం సమ్మతితోనే సంగమించామని, అప్పుడు తాము సహజీవనం చేస్తున్నామని పిటిషనర్ వినయ్ ధర్మాసనానికి తెలిపారు. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీతో లైంగికదాడి చేశారని, అధికారికంగా కాకున్నా, మనాలీలో ఒక గుడిలో వివాహమాడారని మహిళ తరఫు న్యాయవాది వివరించారు. తర్వాత శారీరకంగానూ వేధించారని ఆరోపించారు. కాగా, తాము వివాహం చేసుకోలేదని వినయ్ పేర్కొన్నారు. ఆమె మరో వ్యక్తితోనూ సంబంధాన్ని నెరిపారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కేవలం తనను వేధించడానికేనని అన్నారు. అనంతరం కోర్టు స్పందిస్తూ ఇలాంటి కేసులో ఆమెను బాధితురాలుగా పేర్కొనరాదని సూచించింది. వాదనలు విన్న తర్వాత వినయ్‌కు ఎనిమిది వారాలు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.