వాటితో లాభం లేదు.. కాగ్ నివేదికలో సంచలన నిజాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదంటూ కాగ్ నివేదిక స్పష్టం చేయడం చర్చనీయాంశమవుతోంది. అతిపెద్ద ప్రాజెక్టుగా చూపిస్తున్న కాళేశ్వరం కింద ఎకరా ఆయకట్టు కూడా పారలేదంటూ సూచిస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణ అవసరాలు లేకున్నా అప్పు తీసుకున్నారని, దీంతో వడ్డీభారమవుతుందంటూ పేర్కొనడం విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో నిధులు, వ్యయం, అప్పులపై ఎత్తి చూపిన కాగ్.. ప్రాజెక్టులతో ఫాయిదా ఏముందంటూ ప్రశ్నించింది. ప్రాజెక్టుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదంటూ కాగ్ నివేదిక స్పష్టం చేయడం చర్చనీయాంశమవుతోంది. అతిపెద్ద ప్రాజెక్టుగా చూపిస్తున్న కాళేశ్వరం కింద ఎకరా ఆయకట్టు కూడా పారలేదంటూ సూచిస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణ అవసరాలు లేకున్నా అప్పు తీసుకున్నారని, దీంతో వడ్డీభారమవుతుందంటూ పేర్కొనడం విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో నిధులు, వ్యయం, అప్పులపై ఎత్తి చూపిన కాగ్.. ప్రాజెక్టులతో ఫాయిదా ఏముందంటూ ప్రశ్నించింది. ప్రాజెక్టుల్లో నిర్మాణ జాప్యంతో వ్యయం 146 శాతం పెరిగిందని వెల్లడిస్తోంది.
ఇంకెప్పుడో..?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఇంకా చేతికందడం లేదని కాగ్ నివేదికతో రూఢీ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రధానంగా ప్రాజెక్టులపైనే కోట్లు పెడుతోంది. ఖజానా వెలవెలబోయినా అప్పులు తీసుకువస్తోంది. అయితే ఎండ్ల కిందటే పూర్తి చేయాల్సిన వాటిని ఎందుకు సాగదీస్తున్నారనే కోణంలో కాగ్ వేలెత్తి చూపించింది. దీంతో తొలి అంచనా రూ. 76 వేల కోట్లు అయితే ఆలస్యం కారణంగా రూ. 1.87 లక్షల కోట్లకు నిర్మాణ వ్యయం పెరిగినట్లు లెక్కలేసింది.
వడ్డీ భారం
కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరానికి తక్షణ అవసరం లేకున్నా రూ.539 కోట్లు అప్పు తీసుకొని.. అనవసరంగా రూ.8.51 కోట్ల వడ్డీ చెల్లించడాన్ని కాగ్ తప్పుబట్టింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిట తెచ్చిన గ్యారంటీ రుణాలు రూ.77,713 కోట్లు కాగా, వీటిలో 65 శాతం కాళేశ్వరం, మిషన్ భగీరథకే ఖర్చు పెట్టినట్లు కాగ్ చెప్పింది. తక్షణ అవసరాల కింద తీసుకున్న రుణాలతో ఏం చేశారంటూ ప్రశ్నించింది. ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులు లేటయ్యే కొద్దీ.. వాటి ఖర్చు భారీగా పెరుగుతోందని కాగ్ వివరాలతో సహా ప్రభుత్వం ముందు పెట్టింది. పెట్టుబడి వ్యయంలో ప్రాజెక్టులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, అయినా నిర్మాణంలో ఉన్న 26 ప్రాజెక్టుల్లో 20 ప్రాజెక్టులు లేటు అయ్యాయని, ఇప్పటికే వీటికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, ఇలా జాప్యం కారణంగా రూ.1.8 లక్షల కోట్ల అదనపు భారం పడుతోందని పేర్కొంది.
ఏటేటా అంతేనా..?
మరోవైపు కాగ్ నివేదికలను ప్రభుత్వం తీసిపారేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై సరైన వివరాలు సమర్పించడం లేదంటున్నారు. అయినప్పటికీ కాగ్ ప్రతిసారి ప్రాజెక్టుల వ్యయంపై ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. 2018లో ఇచ్చిన కాగ్ నివేదికల్లోనే ప్రాజెక్టులపై తప్పులు చూపించింది. కానీ ప్రభుత్వం దానికి కనీస సమాధానం కూడా ఇవ్వలేదంటున్నారు. 2018 నివేదికల ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల వరకు జరిగిన జాప్యం కారణంగా 19 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.41,201 కోట్ల నుంచి రూ.1,32,928 కోట్లకు పెరిగినట్లు చూపించింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టుల వల్ల కలిగిన ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంలేదని, 2014–18 మధ్యకాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.79,236 కోట్లు ఖర్చు చేసిందని, 2016–17 మినహాయిస్తే 50 శాతానికిపైగా పెట్టుబడిని సాగునీటి ప్రాజెక్టులపైనే పెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఇప్పుడు 20 ప్రాజెక్టులు…!
ప్రస్తుతం రాష్ట్రంలో 20 ప్రాజెక్టుల పనులు సాగదీస్తున్నారని కాగ్ ఎత్తి చూపించింది. వీటిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు 9 ఉన్నాయి. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ… ప్రభుత్వం ఎందుకో వాటిని నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ –2, నీల్వాయి వంటి ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు మొదలుపెట్టినా ఇంకా పూర్తి చేయకపోవడాన్ని తప్పు పట్టారు. అయితే ప్రాజెక్టులకు పెడుతున్న ఖర్చు కంటే వాటితో వచ్చే ప్రయోజనాలను చూపించడంలో ప్రభుత్వం సఫలం కావడం లేదంటూ కాగ్ పేర్కొంది. దీంతో ప్రాజెక్టుల ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తున్నారంటూ చూపించింది.