Premium Smartphones: ఇకపై ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మరింత కాస్ట్‌లీ
కొత్త మెమొరీ మాడ్యూల్స్, అధునానత చిప్‌సెట్‌లను వాడాల్సి రావడంతో కనీసం 5 శాతం పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదు కానున్నాయి. కొత్త మెమొరీ మాడ్యూల్స్, ఇతర పరికరాలతో పాటు ఏఐ వినియోగం శక్తివంతమైన, అధునానత చిప్‌సెట్‌లను వాడాల్సి రావడంతో వీటి ధరలు కనీసం 5 శాతం పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అత్యంత సంక్లిష్టమైన సర్క్యూట్రీ, అధునాతన తయారీ ప్రక్రియ కారణంగా హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన సరికొత్త తరం చిప్‌సెట్‌లు మునుపటి వాటికంటే దాదాపు 20 శాతం ఖరీదైనవిగా ఉన్నాయని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ప్రీమియం హ్యాండ్‌సెట్‌లకు ఉన్న అధిక డిమాండ్ కారణంగా చిప్‌సెట్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచడం, మరింత హై-ఎండ్ చిప్‌సెట్‌ల తయారీకి వెళ్లేందుకు దోహదపడుతున్నాయి. గతేడాదిలోనూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు 3 శాతం మేర పెరిగాయని, ఈ ఏడాది 5 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. చిప్‌సెట్‌లతో పాటు 5జీ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, మెరుగైన కంప్యూటింగ్ సామర్థ్యాల వల్ల ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల ఖర్చు ఎక్కువవుతోందని వెల్లడించారు.