CNG price hike: సీఎన్ జీ వాహనదారులకు షాక్.. ధరలు పెంచిన గ్యాస్ కంపెనీలు
సీఎన్‌జీ వాహనదారులకు షాక్ తగిలింది. గ్యాస్ కంపెనీలు సీఎన్‌జీ రిటైల్ ధరలను (CNG price hike) పెంచాయి.
దిశ, బిజినెస్: సీఎన్‌జీ వాహనదారులకు షాక్ తగిలింది. గ్యాస్ కంపెనీలు సీఎన్‌జీ రిటైల్ ధరలను (CNG price hike) పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టు పక్కల నగరాల్లో ఆటోమొబైల్‌లో వినియోగించే సీఎన్‌జీని, గృహవసరాలకు వినియోగించే పైప్ గ్యాస్‌ను విక్రయించే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) సీఎన్‌జీ ధరను రూ.2 మేర పెంచింది. ముంబై సహా పలు నగరాల్లో కిలోకు రూ.2 చొప్పున ధర పెరిగింది. ఢిల్లీకి మాత్రం ఈ పెంపు నుంచి మినహాయింపు దక్కింది. ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే, ఆ దేశరాజధానికి మినహాయింపు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ. 75.09 గానే ఉంది. అయితే, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ కూడా పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నొయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లో ఈ పెంపు చేపట్టింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.81.70, గురుగ్రామ్ లో రూ.82.12 గా ఉంది.
ముంబైలోనూ పెరిగిన ధరలు
ఇక, మహారాష్ట్ర ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ముంబైలో సీఎన్‌జీ విక్రయించే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సైతం కిలోకు రూ.2 చొప్పున పెంచింది. గత రెండు నెలలుగా ధరలను స్థిరంగా ఉంచిన అదానీ టోటల్ గ్యాస్ సైతం సీఎన్‌జీ ధరను పెంచింది. దీంతో కిలో సీఎన్‌జీ ధర ముంబైలో రూ.77కు చేరింది. ఇతర నగరాల్లో స్థానిక రిటైలర్లు సైతం సీఎన్‌జీ ధరల పెంపు చేపట్టాయి. అటు ఎంజీఎల్ గానీ, ఐజీఎల్ గానీ పెంపునకు కారణం ప్రకటించలేదు. ఇక, హైదరాబాద్‌లో కిలో సీఎన్‌జీ ధర రూ.96గా ఉంది.