భారత మార్కెట్లో ప్రీమియం కార్ల అమ్మకాలపై వోక్స్‌వ్యాగన్ దృష్టి!

భారత మార్కెట్లో ప్రీమియం కార్ల విక్రయాలపై దృష్టి సారించనున్నట్టు కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2023-04-23 10:51 GMT

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్రీమియం కార్ల విక్రయాలపై దృష్టి సారించనున్నట్టు కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దేశీయంగా విక్రయించిన ప్యాసింజర్ వాహనాల్లో 45 శాతం రూ. 10 లక్షల కంటే ఖరీదైనవి. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్ వ్యూహాన్ని అనుసరించి దేశీయంగా ప్రీమియం కార్ల అమ్మకాలపై దృష్టి సారిస్తామని వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్యాసింజర్ వాహనాల బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా అన్నారు. నాలుగేళ్ల క్రితం వరకు కంపెనీ రూ. 6.5 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్య కార్లను ఎక్కువగా విక్రయించింది.

అయితే, ప్రస్తుతం వినియోగదారుల నుంచి పెరిగిన డిమాండ్, కొత్త ఫీచర్లతో కూడిన సౌకర్యాల కారణంగా కస్టమర్ల నుంచి సగటున రూ. 16 లక్షల విలువైన కార్లకు గిరాకీ పెరిగిందని ఆశిష్ గుప్తా తెలిపారు. మొత్తం వాహన పరిశ్రమలోనూ 2018లో దేశీయంగా అమ్ముడైన సుమారు 18 శాతం కార్ల ధర రూ. 10 లక్షలకు పైగా ఉంది. గతేడాది ఇది 40 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే 43-45 శాతానికి చేరుకుందని ఆయన వివరించారు.

వినియోగదారులు ఫీచర్లు, భద్రత విషయంలో రాజీ పడకపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ అన్ని కార్ల ధరలు రూ. 11-34 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ అమ్మకాల్లో 55 శాతం వాటా రూ. 15-20 లక్షల మధ్య ఉన్న మోడళ్లదే అని ఆయన వివరించారు. కాబట్టి వినియోగదారులు, టెక్నాలజీ, కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇకపై ప్రీమియం కార్లను ఎక్కువ అందుబాటులో ఉండేలా ప్రణాళికను సిద్ధం చెస్తున్నామని ఆశిష్ గుప్తా పేర్కొన్నారు.

Tags:    

Similar News