BSNL: వరుసగా నాలుగో నెల పెరిగిన బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య..!
దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో(Jio), వొడాఫోన్ ఐడియా(Vi), ఎయిర్‌టెల్(Airtel) జులైలో రీఛార్జ్ ప్లాన్(Recharge Plan) ధరలను పెంచిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో(Jio), వొడాఫోన్ ఐడియా(Vi), ఎయిర్‌టెల్(Airtel) జులైలో రీఛార్జ్ ప్లాన్(Recharge Plan) ధరలను పెంచిన విషయం తెలిసిందే. ధరల పెంపు కారణంగా గత కొంత కాలంగా ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్(Subscribers)లను కోల్పోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కంపెనీలకు మరో బిగ్ షాక్ తగిలింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో భారీ మొత్తంలో యూజర్లను కోల్పోయిన ఈ సంస్థలు తాజాగా అక్టోబర్ లోనూ వినియోగదారులను పోగొట్టుకున్నాయి. వీటిలో ఎయిర్‌టెల్ ఒకటే అక్టోబర్ లో స్వల్పంగా యూజర్లను పెంచుకోగా.. మిగతా రెండు చేజార్చుకున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) మాత్రం యూజర్లను పెంచుకోవడం విశేషం. వరుసగా మూడో నెలలో కూడా బీఎస్ఎన్ఎల్ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది.
టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ లో ఎయిర్‌టెల్ కొత్తగా 19.29 లక్షల మంది సబ్ స్క్రైబర్ లను చేర్చుకుంది. అలాగే జియో 37.60 లక్షల యూజర్లను కోల్పోగా.. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను పోగొట్టుకున్నాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం కొత్తగా మరో 5 లక్షల మందిని చేర్చుకుంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లను పోగొట్టుకున్నప్పటికీ రిలయన్స్ జియో మార్కెట్ వాటా పరంగా 39.9 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఎయిర్‌టెల్ 33.50 శాతం, వొడాఫోన్ ఐడియా 18.30 శాతం, బీఎస్ఎన్ఎల్ 8.50 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.