FED: ఎట్టకేలకు వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా ఫెడ్

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎట్టకేలకు ప్రకటన రానే వచ్చింది

Update: 2024-09-19 09:24 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎట్టకేలకు ప్రకటన రానే వచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ (US Federal Reserve) తన వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. 2020 తర్వాత మొదటిసారిగా వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ నిర్ణయంతో 5.25 - 5.50 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు 4.75 -5.0 శాతానికి చేరాయి. అంతకుముందు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో వడ్డీ రేట్లను పెంచగా, ఇటీవల కాలంలో అది తగ్గుముఖం పట్టింది. దీంతో రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గడంతో, అమెరికా బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులకు తక్కువ రేట్లపై రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

ప్రస్తుత అమెరికాలో ద్రవ్యోల్బణం 2% లోపు నమోదు అయ్యేలా ఉంది. ఆర్థిక అంచనా ప్రకారం, నిరుద్యోగం రేటు నాలుగో త్రైమాసికంలో 4.4% వరకు, ద్రవ్యోల్బణం రేటు 2.3% వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేయగా ఏకంగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించడంతో ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్‌బీఐ కూడా తన వడ్డీ రేట్లను తగ్గించడానికి మొగ్గు చూపవచ్చు

ఫెడ్ నిర్ణయంతో పెరిగిన బంగారం ధరలు: వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. తాజాగా ఔన్సుకు $2,600కి పెరిగాయి. ఫెడ్ అంచనాలు వడ్డీ రేట్లు 2025 నాటికి 3.4%, 2026 నాటికి 2.9%కి తగ్గవచ్చని సూచిస్తున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడి కారణంగా మంచి రాబడి వస్తుందని అంచనాతో దీనిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి.


Similar News