Trade Deficit: ఫిబ్రవరిలో దిగొచ్చిన వాణిజ్య లోటు
దిగుమతులు కూడా 16.3 శాతం తగ్గి రూ. 50.96 బిలియన్ డాలర్ల(రూ. 4.42 లక్షల కోట్ల)కు తగ్గాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు 36.91 బిలియన్ డాలర్ల(రూ. 3.20 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 10.9 శాతం తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఇదే నెలలో దిగుమతులు కూడా 16.3 శాతం తగ్గి రూ. 50.96 బిలియన్ డాలర్ల(రూ. 4.42 లక్షల కోట్ల)కు తగ్గాయి. ఫలితంగా వాణిజ్య లోటు గత నెలలో 14 బిలియన్ డాలర్ల(రూ. 1.21 లక్షల కోట్ల)కు దిగొచ్చింది. అంతకుముందు జనవరిలో వాణిజ్య లోటు 23 బిలియన్ డాలర్లు(రూ. 1.99 లక్షల కోట్లు)గా ఉంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను సోమవారం వెల్లడించింది. పెట్రోలియం ధరలలో అస్థిరత, ప్రపంచ అనిశ్చితి కారణంగా ఎగుమతుల్లో క్షీణత నమోదైంది. దిగుమతులు, ఎగుమతులు రెండూ క్షీణించడం వల్ల ఫిబ్రవరి నెల వాణిజ్య లోటు 2021, ఆగష్టు స్థాయికి పడిపోయిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల సంయుక్త ఎగుమతులు 800 బిలియన్ డాలర్ల(రూ. 69.37 లక్షల కోట్ల) విలువను అధిగమించనున్నాయి, అయినప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు, దిగుమతులపై ఒత్తిడి కొనసాగనున్నట్టు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానం, అనేక దేశాల పారిశ్రామిక విధానాలు, పెరిగిన వాణిజ్య యుద్ధ ప్రభావం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.
Read More..
Banks: 10 ఏళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసిన బ్యాంకులు