Swiggy: అదనపు డెలివరీ ఛార్జీలు విధించినందుకు స్విగ్గీకి రూ. 35,000 జరిమానా
కస్టమర్‌కు మెంబర్‌షిప్ ప్రయోజనాలు ఉన్నా డెలివరీ దూరాన్ని పెంచి డెలివరీ ఛార్జీలకు అదనంగా రూ. 103 స్విగ్గీ వసూలు చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి హైదరాబాద్‌లోని కోర్టు రూ. 35 వేలకు పైగా జరిమానా విధించింది. కస్టమర్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు ఉన్నప్పటికీ అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేసిన కారణంగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అన్యాయమైన వ్యాపార విధానాలను అనుసరించిన కారణంగా స్విగ్గీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కస్టమర్‌కు మెంబర్‌షిప్ ప్రయోజనాలు ఉన్నా సరే డెలివరీ దూరాన్ని 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు పెంచి డెలివరీ ఛార్జీలకు అదనంగా రూ. 103 స్విగ్గీ వసూలు చేసింది. దీనికి సంబంధించి ఫిర్యాదుదారుడు గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌లను కూడా సమర్పించారు. దీంతో ఇది అన్యాయమైన పద్దతులకు పాల్పడినట్టు కోర్టు గుర్తించి, కస్టమర్‌కు రూ. 35,453 చెల్లించాలని ఆదేశించింది. అలాగే, కస్టమర్ దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ, రూ. 103 డెలివరీ ఛార్జీలను కలిపి రూ. 350.48 రీఫండ్ చేయాలని కోర్టు స్విగ్గీని ఆదేశించింది. ఆదేశాలను అమలు చేసేందుకు కంపెనీకి కోర్టు 45 రోజుల గడువు ఇచ్చింది.