Swiggy IPO: ఐపీఓకు సిద్ధమవుతున్న స్విగ్గీ.. 1 బిలియన్ డాలర్లకు పైగా నిధుల సేకరణ లక్ష్యం

ఐపీఓలో భాగంగా 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,400 కోట్ల) వరకు నిధులు సమీకరించాలని స్విగ్గీ ప్రయత్నిస్తోంది.

Update: 2024-09-15 15:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఐపీఓకు రెడీ అవుతోంది. ఈ వారంలోనే తన పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఫైల్ చేయాలని కంపెనీ భావిస్తోంది. షేర్లను విక్రయించడానికి ఇది సరైన సమయమని స్విగ్గీ అంచనా వేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఓలో భాగంగా 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,400 కోట్ల) వరకు నిధులు సమీకరించాలని స్విగ్గీ ప్రయత్నిస్తోంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఐపీఓ పరిమాణంపై కంపెనీ పరిశీలిస్తోంది. ఐపీ మొత్తంలో షేర్ల విక్రయం ద్వారా రూ. 3,750 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 6,664 కోట్లను సమీకరించనుంది. అయితే, ఐపీఓ మొత్తంపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కంపెనీ ఏజీఎంలో కొత్త ప్రతిపాదనకు బోర్డు ఆమోదిస్తే ఐపీ పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2014లో ప్రారంభమైన స్విగ్గీ సేవలు దేశంలో 1,50,000 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో జొమాటోతో పాటు బ్లింక్ఇట్ లాంటి పోటీ సంస్థలు ఉండటంతో స్విగ్గీ మార్కెట్ కేపిటల్ పరంగా లాభాలను సాధించాలని భావిస్తోంది. మరో క్విక్-కామర్స్ కంపెనీ జెప్టో సైతం భారీ మొత్తంలో నిధులను సేకరించి మార్కెట్లో పట్టు సాధించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా క్విక్ కామర్స్‌లోకి అడుగుపెట్టడంతో పోటీ మరింత పెరిగింది. 

Tags:    

Similar News