వరుసగా రెండో రోజు లాభాల్లో సూచీలు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ర్యాలీ అయ్యాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ర్యాలీ అయ్యాయి. మార్కెట్లు అంచనా వేసినట్టుగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించడంతో మదుపర్ల సెంటిమెంట్ సానుకూలంగానే కొనసాగుతోంది. దీనికి తోడు గురువారం ట్రేడింగ్‌లో భారత రూపాయి మారకం విలువ అమెరికా డాలరుతో పోలిస్తే స్వల్పంగా బలపడటంతో సూచీలు పుంజుకున్నాయి. ఉదయం కొంతసేపు నష్టాలు ఎదురైనప్పటికీ మిడ్-సెషన్ తర్వాత రాణించాయి. ముఖ్యంగా కనిష్టాల వద్ద పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో పాటు కీలక కంపెనీల షేర్లు రాణించడం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 142.43 పాయింట్లు ఎగసి 60,806 వద్ద, నిఫ్టీ 21.75 పాయింట్లు లాభపడి 17,893 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా రంగాలు మెరుగ్గా ర్యాలీ చేయగా, మెటల్ రంగం 1 శాతానికి పైగా బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.
భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, అల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.54 వద్ద ఉంది.