చివరి అరగంటలో లాభపడ్డ స్టాక్ మార్కెట్లు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఊహించని విధంగా లాభాలను సాధించాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఊహించని విధంగా లాభాలను సాధించాయి. హోళీ సందర్భంగా ఒకరోజు సెలవు తర్వాత మొదలైన బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం నుంచి నష్టాల్లో కదలాడిన తర్వాత అనూహ్యంగా చివరి అరగంటలో లాభాలను సాధించాయి. అమెరికా ఫెడ్ ఛైర్మన్ వడ్డీ రేట్లకు సంబంధించి పెంపు ఉంటుందనే సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురయ్యాయి.
అలాగే, దేశీయంగా అదానీ షేర్లు వరుసగా ఆరో రోజు ర్యాలీ చేశాయి. అదానీ సంస్థ ముందస్తు రుణాలను చెల్లిస్తుండటంతో పాటు జీక్యూజీ కంపెనీ షేర్లలో మరిన్ని పెట్టుబడులకు సంకేతాలివ్వడంతో లాభపడ్డాయి. వీటికి తోడు ఐటీ, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. కానీ చివరి అరగంటలో ఫైనాన్స్, బ్యాంకింగ్, కొన్ని ఆటో షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు లాభాలకు మారాయి. గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా చివర్లో లాభాలకు కారణం అయ్యుండోచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.63 పాయింట్లు లాభపడి 60,348 వద్ద, నిఫ్టీ 42.95 పాయింట్లు పెరిగి 17,754 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఫార్మా, ఐటీ రంగాలు నీరసించగా, ఆటో, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం పుంజుకుంది.
ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, అల్ట్రా సిమెంట్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.03 వద్ద ఉంది.
Also Read..