Adani : ‘అదానీ’ వ్యవహారంపై రాజకీయ దుమారం.. కేంద్ర, రాష్ట్రాల రియాక్షన్
దిశ, నేషనల్ బ్యూరో : అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీ(Adani)పై అమెరికా(US)లో కేసులు నమోదవడంపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీ(Adani)పై అమెరికా(US)లో కేసులు నమోదవడంపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడిగా గౌతం అదానీని భావిస్తుంటారు. అటువంటి పారిశ్రామిక దిగ్గజం చుట్టూ అమెరికాలో చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటాన్ని భారత్‌లోని కేంద్ర(Centre Govt), రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదానీ గ్రూపుపై అమెరికాలో కేసులు నమోదైనందున తాము స్పందించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదానీ గ్రూపు వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై క్లారిటీ ఇస్తే సరిపోతుందని బీజేపీ వాదిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ప్రస్తుతం ఫోకస్‌లో ఉన్నాయి.
తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా..
‘‘అదానీ గ్రూపుతో తమిళనాడు విద్యుత్ శాఖ నేరుగా ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు. 25 ఏళ్ల పాటు ఒక్కో యూనిట్‌కు రూ.2.61 చొప్పున వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్’తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ దీనిపై స్పందిస్తూ.. తమ హయాంలో అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో గత బీజేడీ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా వ్యవహరించిన పి.కె.దేవ్ స్పందిస్తూ.. అదానీ గ్రూపు నుంచి తాము ఎలాంటి ముడుపులూ తీసుకోలేదని తేల్చి చెప్పారు. నిరాధార ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీ, తెలంగాణ..
‘‘కొన్ని ఒప్పందాలను కుదుర్చుకునేందుకు అదానీ గ్రూపు అధికారులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోని పలువురికి ముడుపులు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు లభిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ అంశం వల్ల ఏపీ ప్రతిష్ఠ దెబ్బతింది. తదుపరిగా దీనిపై సమాచారాన్ని సేకరించి తగిన నిర్ణయం తీసుకుంటాం’’ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక తెలంగాణలోనూ అదానీ గ్రూపు పలు వ్యాపార ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. దీనిపై తాజాగా బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అదానీని రాహుల్ గాంధీ తిడుతుంటే.. మరోవైపు అదానీతో సీఎం రేవంత్ సర్కారు ఒప్పందాలు కుదుర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు.