Stock Market: తిరిగి 75,000 మార్కు అధిగమించిన సెన్సెక్స్
భారత వాణిజ్య లోటు మూడున్నరేళ్ల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చాలారోజుల తర్వాత భారీ లాభాలు నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో అధిక లాభాలతో రాణించిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయంగా కీలక మెటల్, ఫైనాన్స్ షేర్లలో ర్యాలీ కారణంగా సెన్సెక్స్ తిరిగి 75,000 మార్కును అధిగమించింది. ప్రధానంగా అమెరికాతో నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలకు.. అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లలోనూ ర్యాలీ కనిపించింది. ఈ ప్రభావానికి తోడు దేశీయంగా తాజా గణాంకాల్లో భారత వాణిజ్య లోటు మూడున్నరేళ్ల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలోనే మదుపర్లు సంపద ఒక్కరోజే రూ. 6.85 లక్షల కోట్లు పెరగడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 400 లక్షల కోట్లకు చేరింది. గత కొంతకాలంగా వాణిజ్య భయాలతో నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లకు తాజా పరిణామాల మధ్య భారతీయ స్టాక్స్ తక్కువ ధరలో లభిస్తుండటానికి తోడు జీడీపీ వృద్ధి మెరుగ్గా ఉండటం, పారిశ్రామికోత్పత్తి, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం వంటి అంశాలు భారీ లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,131.31 పాయింట్లు ఎగసి 75,301 వద్ద, నిఫ్టీ 325.55 పాయింట్లు లాభపడి 22,834 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ మాత్రమే నష్టాలను ఎదుర్కొన్నాయి. జొమాటో, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా వంటి షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.58 వద్ద ఉంది.