ఇకపై వారికి కూడా 'యోనో యాప్' సేవలు!
డిజిటల్ బ్యాంకింగ్ యాప్ పరిధిని విస్తరించే క్రమంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త సేవలను ప్రారంభించింది.
న్యూఢిల్లీ: డిజిటల్ బ్యాంకింగ్ యాప్ పరిధిని విస్తరించే క్రమంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త సేవలను ప్రారంభించింది. తన యోనో యాప్ సేవల విస్తరణలో భాగంగా ఇకమీదట ఎస్‌బీఐ వినియోగదారులు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించేలా అనుమతించింది. దీంతో ఎస్‌బీఐ ఖాతా లేని వారు సైతం యోనో యాప్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేసే సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
యోనో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చామని ఎస్‌బీఐ ప్రకటించింది. 'యోనో ఫర్ ఎవ్‌రీ ఇండియన్ ' ద్వారా స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పే బై కాంటాక్ట్స్ లాంటి యూపీఐ సేవలను బ్యాంకు అందించనుంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్ని కూడా అందించనున్నట్టు బ్యాంకు వెల్లడించింది.
ఏటీఎంలలో ఏ బ్యాంకు వినియోగదారులైనా ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఉండే యూపీఐ క్యూఆర్ క్యాష్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఏటీఎం కార్డు వాడకుండా నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనుంది. ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త సేవల ద్వారా ఇప్పటికే యూపీఐ సేవల్లో ఉన్న ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి వాటికి గట్టి పోటీ ఉండనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.