అధిక పెన్షన్‌పై ఉమ్మడి ఆప్షన్‌కు ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ జారీ!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సోమవారం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీసీ) కింద అధిక పెన్షన్ అంశంపై కీలక విధానాన్ని తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సోమవారం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీసీ) కింద అధిక పెన్షన్ అంశంపై కీలక విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులు, సంస్థలకు సంయుక్తంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అధిక పెన్షన్ ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ జారీ చేసింది.
ఉమ్మడి ఆప్షన్‌ను పర్యవేక్షించే బాధ్యతలను ప్రాంతీయ కార్యాలయాలకు ఇచ్చింది. 2014, ఆగస్టు 22 నాటి ఈపీఎఫ్ సవరణ ప్రకారం పెన్షన్ జీతం పరిమితిని రూ. 6,500 నుంచి రూ. 15,000కి పెరిగింది. అదే సమయంలో గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా దానికంటే ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగులు ఈపీఎఫ్ లో జమ చేసేందుకు అనుమతిచ్చింది. అందుకు నిర్దేశిత గడువనేది ఏమీ ఇవ్వలేదు.
కానీ, 2014లో సవరణ జరిగిన సమయానికి పథకంలో చేరని ఉద్యోగులకు అవకాశం ఇవ్వలేదు. దాంతో సుప్రీంకోర్టు ఆ సమయంలో వారికి మరొక అవకాశం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. అందుకణుంగానే తాజాగా ఉమ్మడి ఆప్షన్‌కు అవకాశం కల్పిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. బాధ్యతలను ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలకు ఇచ్చింది.
ఇక, ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక వెబ్(యూఆర్ఎల్) అందుబాటులోకి తీసుకొస్తామని, ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో లింక్ అందిస్తామని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దాని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు లాగ్-ఇన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. అందుకు దరఖాస్తు చేసుకున్న వారికి రసీదు నెంబరు కేటాయించడం జరుగుతుంది. వాటిని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయంలో పరిశీలిస్తారు.