RBI: దివ్యాంగులకు చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయాలని కోరిన ఆర్‌బీఐ
దివ్యాంగులకు సమర్థవంతమైన యాక్సెస్‌ను అందించేందుకు వారికి చెల్లింపుల వ్యవస్థలు, పరికరాలను సమీక్షించాలని సూచించింది
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించాలని, దాని ఆధారంగా చెల్లింపుల వ్యవస్థలో అవసరమైన మార్పులను చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా దివ్యాంగులకు సమర్థవంతమైన యాక్సెస్‌ను అందించేందుకు వారికి చెల్లింపుల వ్యవస్థలు, పరికరాలను సమీక్షించాలని సూచించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు తమ చెల్లింపుల వ్యవస్థలు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌ల వంటి పరికరాలను దివ్యాంగులు సులభంగా యాక్సెస్ చేసే, ఉపయోగించే సవరణలు చేయాలని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన యాక్సెసబిలిటీ ప్రమాణాలను సూచించాలని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, చెల్లింపుల వ్యవస్థలో చేసిన మార్పుల గురించి ఆర్‌బీఐకి తెలియజేసేందుకు నెల రోజుల సమయం ఉంటుందని స్పష్టం చేసింది.