దేశంలో ఈవీ బస్సులు వృద్ధికి రెండు అంశాలు కీలకం: అశోక్ లేలండ్!

Update: 2023-09-10 16:12 GMT

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచేందుకు రెండు కీలకమైన అంశాలు ఎంతో ఉపకరిస్తాయని అశోక్ లేలండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలానికి ఒప్పందాల కోసం సురక్షితమైన చెల్లింపుల వ్యవస్థ దేశంలోని ఈవీ బస్సుల ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనికి అదనంగానే రాయితీలను అందించడం మొత్తం పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి, ఈవీ వాహనాలను వాడేందుకు అందించే సబ్సిడీ లేదా ఏవైనా ప్రయోజనాలు, ఆపై సురక్షితమైన చెల్లింపుల వ్యవస్థ అవసరమని, ఇది పరిశ్రమ వేగవంతమైన వృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికే తమ చెల్లింపుల విధానానికి సంబంధించి కొన్ని రకాల భద్రతను పరిశీలిస్తోంది. ఈవీ బస్సులకు సంబంధించి 10-12 ఏళ్ల పాటు ఒప్పందాలు జరుగుతాయి. ఒరిజినల్ తయారీదారులుగా తాము ఈ సుధీర్ఘ కాలానికి చేసే చెల్లింపులకు మెరుగైన భద్రతను కోరుకుంటున్నామన్నారు. బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల విషయంలో సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వ మద్దతుపై భద్రత ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం మద్దతు బలంగా ఉంటే గనక డిమాండ్‌లో స్పష్టమైన వృద్ధి కనిపిస్తుందని ఆయన వెల్లడించారు.


Similar News