మెరుగైన లాభాలను సాధించిన సూచీలు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బీఐ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో మార్కెట్లలో ప్రతికూల ప్రభావం కనిపించలేదు. భారత జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ సానుకూలంగా ఉండటం కూడా లాభాలకు కారణమయ్యాయి.
ప్రధానంగా గత కొన్ని సెషన్ లలో బలహీనపడిన కీలక అదానీ స్టాక్స్, రిలయన్స్ కంపెనీల షేర్లు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపించడంతో సూచీలు పుంజుకున్నాయి. వీటికి తోడు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలేమీ లేకపోవడంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు అధిక లాభాలను సాధించాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 377.75 పాయింట్లు లాభపడి 60,663 వద్ద, నిఫ్టీ 150.20 పాయింట్లు పెరిగి 17,871 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా సిమెంట్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీల షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి.
ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.54 వద్ద ఉంది.