మెటా సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ. 639 నుంచి ప్రారంభం.. గరిష్ఠంగా రూ. 21 వేలు
మెటా సరికొత్త ఫీచర్లు, ప్రయోజనాలతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్‌ను విస్తరిస్తున్నట్టు పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను బుధవారం ప్రారంభించింది. గతేడాది పైలట్ ప్రాజెక్టుగా పరిమిత సంఖ్యలో వినియోగదారులతో సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించిన మెటా సరికొత్త ఫీచర్లు, ప్రయోజనాలతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్‌ను విస్తరిస్తున్నట్టు పేర్కొంది. వ్యాపారాల కోసం వెరిఫై చెసిన బ్యాడ్జ్, మరింత మెరుగైన అకౌంట్ సపోర్ట్ లభిస్తుందని మేటా చెబుతోంది. అంతేకాకుండా అదనపు రక్షణ, ఫీచర్లు ఉండనున్నాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ నెలకు ఒక యాప్‌కు రూ. 639 నుంచి ప్రారంభం అవుతుందని, గరిష్ఠంగా రూ. 21,000 వరకు ఉంటుందని మెటా వివరించింది. ఇది నెలకు రెండు యాప్‌లకు ప్రారంభ డిస్కౌంట్ రేటు అని మెటా స్పష్టం చేసింది. అలాగే, వివిధ కంపెనీలు తమ వ్యాపారావసరాల కోసం అనువైన ప్యాకేజీ ఎంచుకునేందుకు వీలుగా మెటా నాలుగు భిన్నమైన వెరిఫైడ్ ప్లాన్లను కూడా అందిస్తోంది. భారతీయ యూజర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అధికారిక ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్ల నుంచి మాత్రమే కొనే వీలుంటుంది.