రికార్డు స్థాయిలో పెరిగిన ఎల్‌పీజీ కనెక్షన్లు!
దేశంలో వంట గ్యాస్ వాడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత తొమ్మిదేళ్ల కాలంలో కొత్తగా 17 కోట్ల వినియోగదారులు వంటగ్యాస్(ఎల్‌పీజీ) కనెక్షన్లను తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ వాడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత తొమ్మిదేళ్ల కాలంలో కొత్తగా 17 కోట్ల వినియోగదారులు వంటగ్యాస్(ఎల్‌పీజీ) కనెక్షన్లను తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. 2014, ఏప్రిల్‌లో 14.52 కోట్ల కనెక్షన్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 31.36 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం మద్దతు ద్వారా భారీ స్థాయిలో ఎల్‌పీజీ కనెక్షన్లు భారీగా పెరిగాయి. ఈ పథకం కింద మొదట్లో ఐదు కోట్ల మంది మహిళలకు అందించాలని నిర్ణయించినప్పటికీ, తర్వాత 8 కోట్లకు పెంచారు. వినియోగంతో పాటు గతం కంటే మెరుగ్గా ఎల్‌పీజీ సిలిండర్ల లభ్యత కూడా మెరుగ్గా ఉంది.
ఇదివరకు కొత్త సిలిండర్ కోసం బుకింగ్ చేసిన తర్వాత 7-10 రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఇది కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల్లో, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం 24 గంటల్లో కూడా డెలివరీ అవుతున్నాయి. గణాంకాల ప్రకారం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉజ్వల యోజన వినియోగదారులు ఏడాదిలో సగటున 3.01 సిలిండర్లను వాడేవారు. 2021-22 నాటికి అది 3.66 సిలిండర్లకు చేరింది.