భారత్‌లో వేగంగా పెరుగుతున్న అత్యంత సంపన్నులు

2023లో దేశీయంగా మొత్తం 13,263 మంది అత్యంత సంపన్నులు ఉండగా, 2028 నాటికి 50.1 శాతం పెరిగి 19,908కి చేరుకోనుంది.

Update: 2024-02-28 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అత్యంత సంపన్నులు వేగంగా పెరుగుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో సంపన్నుల (మిలియనీర్లు, బిలియనీర్ల) సంఖ్య భారీగా పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. బుధవారం విడుదలైన 'ది వెల్త్ రిపోర్ట్-2024' 2023 నుంచి 2028 మధ్య దేశీయ ఆల్ట్రా హై-నెట్‌వర్క్ ఇండివిడ్యువల్ అంటే 30 మిలియన్ డాలర్లు(రూ. 250 కోట్ల) కంటే ఎక్కువ సంపద ఉన్న వారి సంఖ్య ఇతర దేశాల కంటే అత్యధిక వృద్ధిని భారత్ సాధిస్తుందని నివేదిక వెల్లడించింది. 2023లో దేశీయంగా మొత్తం 13,263 మంది అత్యంత సంపన్నులు ఉండగా, 2028 నాటికి 50.1 శాతం పెరిగి 19,908కి చేరుకోనుంది. భారత్ తర్వాత చైనా(47 శాతం), మలేషియా(35 శాతం) వృద్ధిని చూడనున్నాయి. భారత్‌లో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి మిగిలిన దేశాల వేగంగా ఉండటం వల్లనే అత్యంత సంపన్నుల సంఖ్య వేగంగా పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ లియామ్ బెయిలీ చెప్పారు. ' భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించి వృద్ధి అంచనాలే ప్రధాన కారణం. ఆర్థిక అంచనాలను పరిశీలించిన తర్వాత ఒక దేశ వృద్ధిని పరిగణలోకి తీసుకుంటాం. వచ్చే ఐదేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ మెరుగైన పనితీరు ద్వారా వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందనే అభిప్రాయం ఉంది. ఇది సంపన్నుల సంఖ్య పెరుగుదలకు కీలకమని ' లియామ్ బెయిలీ వివరించారు.

అధిక జనాభా కూడా భారత ఉన్నతమైన ఆవిష్కరణలకు, ఇతర దేశాలు, కంపెనీలతో కనెక్టివిటీకి దోహదపడుతుంది. 2023లో భారత సంపన్నుల సంఖ్య అంతకుముందు సంవత్సరం కంటే 6.1 శాతంతో పెరుగుదలను చూసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా, వీరి సగటు పెరుగుదల 4.2 శాతం పెరిగి 6,26,619కి చేరింది. దేశీయ అత్యంత సంపన్నులు ఈ ఏడాది కూడా తమ సంపద పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. 90 శాతం భారతీయ సంపన్నులు 2024లో తమ సంపద పెరుగుతుందని ఆశిస్తున్నారని' నివేదిక తెలిపింది. వారిలో దాదాపు 63 శాతం మంది ఈ ఏడాది తమ సంపద 10 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, రేట్ల తగ్గింపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మరింతగా పెంచుతాయి. ఈ సెంటిమెంట్ ద్వారా సంపన్న భారతీయులు ప్రయోజనాలు పొందనున్నారని 'లియామ్ వెల్లడించారు.

2023లో దేశీయ సంపన్నులు ఖరీదైన వాచీలపై పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత ఆర్ట్స్, జ్యువెలరీ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారు. ముఖ్యంగా, నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2023 ప్రకారం, గత పదేళ్లలో ఖరీదైన వాచీల ధరలు 138 శాతం పెరిగాయి. ఆర్ట్స్, ఆభరణాల ధరలు వరుసగా 105 శాతం, 37 శాతంగా పెరిగాయి. ప్రపంచ దేశాల్లో సంపన్నులు లగ్జరీ ఉత్పత్తుల కొనుగోలు ధోరణి భిన్నంగా ఉంది. వారు ఎక్కువగా ఆర్ట్స్, వాచీలు, ఆ తర్వాత క్లాసిక్ కార్లపై ఇన్వెస్ట్ చేశారని నివేదిక తెలిపింది. గత పదేళ్లలో క్లాసిక్ కార్ల ధరలు 82 శాతం పెరిగాయని స్పష్టం చేసింది. ఇక, భారత్‌లో వయసుతో సంబంధం లేకుండా అరుదైన వస్తువుల సేకరణకు డిమాండ్ పెరుగుతోంది. ఇది సంపద వృద్ధిని సూచిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ వెల్లడించారు.

మరోవైపు, ఆల్ట్రా రిచ్‌ల సంఖ్య పెరుగుదలలో ఆసియా ప్రాంతం ఆధిపత్యం చెలాయిస్తోందని నివేదిక తెలిపింది. ఆసియాలో వచ్చే ఐదేళ్లకు అత్యంత సంపన్నుల సంఖ్య 38.3 శాతం పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల 28.1 శాతంగా పేర్కొంది.

Tags:    

Similar News