2024లోనూ అత్యంత వేగంగా భారత వృద్ధి: అసోచామ్

భారత్ 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య అసోచామ్ గురువారం ప్రకటనలో తెలిపింది...

Update: 2023-12-28 12:24 GMT

న్యూఢిల్లీ: భారత్ 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య అసోచామ్ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలో వినియోగ గిరాకీ కారణంగా రైల్వే, విమానయానం, నిర్మాణ, ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.6 శాతంతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశంగా నిలిచింది. ఇది ఇతర ఆర్థికవ్యవస్థల కంటే అత్యంత నమ్మకమైనదిగా, మెరుగైన అవకాశాలను కల్పించేదిగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. వచ్చే ఏడాదిలో ఆర్థిక, నిర్మాణ, హోటళ్లు, ఏవియేషన్, ఆటో, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల ఆధ్వర్యంలో దేశీయ కంపెనీల పనితీరు మరింత మెరుగుపడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలగడం ఇందుకు సహాయపడుతుందని అసోచామ్ పేర్కొంది. 

Tags:    

Similar News