ఆల్కాజర్ కొత్త వేరియంట్ విడుదల చేసిన హ్యూండాయ్!

దేశీయ రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ ఇండియా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ) మోడల్ ఆల్కాజర్‌ను మంగళవారం విడుదల చేసింది.

Update: 2023-03-07 16:27 GMT

న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ ఇండియా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ) మోడల్ ఆల్కాజర్‌ను మంగళవారం విడుదల చేసింది. 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్ అయిన ఈ కారు ధర రూ. 16.74 లక్షల నుంచి రూ. 20.25 లక్షల(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ) మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ఆల్కాజర్ మోడల్‌కు భారీ గిరాకీ ఉందని, ఈ తరుణంలో కొత్త ఇంజిన్ ఎంపికల్లో కారు అందుబాటులోకి రావడం ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ అభిప్రాయపడింది.

ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే బుకింగ్స్ మొదలవగా, ఈ నెలాఖరు నుంచి వినియోగదారులకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త ఆల్కాజర్ బేస్ ఎడిషన్ ధర మునుపటి 2.0 లీటర్ ఇంజిన్ పెట్రోల్ మోడల్ కంటే రూ. 65 వేలు ఎక్కువ ఉంది. కొత్త మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఇతర భద్రతా ఫీచర్లను అదనంగా అందించడం వల్లనే ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర పెరిగిందని కంపెనీ వివరించింది.

అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌ వంటి ఫీచర్లు వినియోగదారుల భద్రతను కాపాడతాయని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడళ్లకు పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News