తక్కువ ధరలో మార్కెట్లోకి 100cc ' షైన్ ' బైకును విడుదల చేసిన హోండా!

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన షైన్ మోడల్ 100సీసీ వెర్షన్‌ను బుధవారం విడుదల చేసింది.

Update: 2023-03-15 10:32 GMT

ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన షైన్ మోడల్ 100సీసీ వెర్షన్‌ను బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే 125సీసీ విభాగంలో ఉన్న షైన్ మోడల్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బేసిక్ మాస్ కమ్యూటర్ కేటగిరిలో 100 సీసీ బైకును తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఇది అత్యంత సరసమైన ధరలో లభించడమే కాకుండా మెరుగైన ఇంధన సామర్థ్యంతో తీసుకొచ్చామని, దీని ధరను రూ. 64,900గా నిర్ణయించినట్టు వెల్లడించింది.

షైన్ మోడల్‌పై ప్రజల్లో ఆదరణ ఉంది. కొన్నేళ్ల నుంచి షైన్ బ్రాండ్ మరింత మందికి చేరువ కావడానికి 100 సీసీ విభాగంలో కూడా దీన్ని తీసుకొచ్చాం. సరసమైన ధరలో దీన్ని అందించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుకోనున్నామని హోండా ఇండియా అధ్యక్షుడు, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అట్సుషి ఒగాటా చెప్పారు.

సరికొత్తగా విడుదల చేసిన షైన్ 100 సీసీ అధిక ఇంధన సామర్థ్యంతో లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. తక్కువ ఉద్గార స్వభావం, 4-స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న బైకు ఐదు రంగుల ఎంపికలో లభిస్తుంది.

Tags:    

Similar News