కొత్త ఎస్‌యూవీ 'ఎలివేట్' కారును ఆవిష్కరించిన హోండా కార్స్ ఇండియా!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ మోడల్ ఎలివేట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

Update: 2023-06-06 11:52 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ మోడల్ ఎలివేట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. తొలిసారి భారత్‌లోనే ఈ కారును విడుదల చేసినట్టు కంపెనీ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేసింది. జులై నుంచి ఎలివేట్ కోసం బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఈ కారు ద్వారా భారత్‌ను ఎగుమతి హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే దేశీయ మార్కెట్లోనే మొదటిసారి విడుదల చేస్తున్నామని, ఈ కారు నాణ్యమైన ఉక్కుతో డిజైన్ చేయబడిందని, కారు లోపలి భాగం విశాలంగా, వెనుకవైపు ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా రూపొందించామని తెలిపింది.

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో వచ్చే ఎలివేట్ మోడల్ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఏబీఎస్(యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌), హిల్‌ అసిస్టెంట్‌, రేర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, ట్రాక్సన్‌ కంట్రోల్, హెహికల్ స్టెబిలిటీ అసిస్టెంట్‌, సీల్‌ బెల్ట్‌ రిమైండర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది.

6 స్పీడ్ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, సీవీటీ గేర్‌ బాక్స్‌ రెండు ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో ఎలివేట్ కారు వస్తుంది. మొదట దేశీయ మార్కెట్​లోకి​ అందుబాటులోకి తెచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. 2030 నాటికి భారత మార్కెట్లో ఎలివేట్ సహా ఐదు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఎలివేట్ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మూడేళ్లలో తీసుకొస్తామని హోండా కార్స్ ఇండియా సీఈఓ టకుయ ట్సుమురా అన్నారు. దీని ధర గురించి కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. పరిశ్రమ వర్గాల ప్రకారం రూ. 10-16 లక్షల మధ్య ఎలివేట్ ఉంటుందని అంచనా.

Tags:    

Similar News