Online Gaming : ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు బిగ్ రిలీఫ్..
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారత అత్యున్నత న్యాయస్థానం భారీ ఊరట కల్పించింది.
దిశ, బిజినెస్ బ్యూరో : ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారత అత్యున్నత న్యాయస్థానం భారీ ఊరట కల్పించింది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇచ్చిన రూ. 1.12 లక్షల కోట్ల విలువైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) షోకాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నోటీసుల కింద అన్ని చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించి జీఎస్టీ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్ స్పష్టం చేసింది. దాంతో పాటు ఆన్‌లైన్ గేమింగ్‌లో పెట్టే మొత్తం విలువపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీని గురించే గేమింగ్ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. అమలు ప్రకటించిన తేదీ నుంచే 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గేమింగ్ కంపెనీలు చెబుతుండగా, చట్టం ఇది వరకే అమల్లో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై గేమింగ్ కంపెనీలు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అనంతరం హైకోర్టుల్లో దాఖలైన అన్ని పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ కోర్టులో జీఎస్‌టీ విభాగం తరఫున వాదనలు వినిపించారు. కొన్ని షోకాజ్ నోటీసుల గడువు ఫిబ్రవరిలో ముగుస్తాయన్నారు. చట్టపరమైన ప్రక్రియ కారణంగా నోటీసులకు కాలపరిమితిగా ఉండదని సుప్రీంకోర్టు రెవెన్యూ శాఖకు హామీ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం, గేమింగ్ కంపెనీలపై అన్ని చర్యలను నిలిపివేయాలని తెలిపింది. తదుపరి విచారణ మార్చి 18కి వాయిదా వేసింది.