రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న హార్లె, ట్రయంఫ్

ఫిబ్రవరి నాటికి ట్రయంఫ్ స్పీడ్400, స్క్రాంబ్లర్ 400ఎక్స్ 15,000 యూనిట్లు, 10,000 యూనిట్ల హార్ ఎక్స్440 బైకుల విక్రయం

Update: 2024-02-18 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రీమియం బైకుల విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇన్నేళ్లు ఆధిపత్యం కలిగి ఉంది. ముఖ్యంగా 250-750సీసీ రేంజ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీనే లేకుండా ఉండేది. అయితే, గతేడాది గ్లోబల్ ప్రీమియం బ్రాండ్‌లైన హార్లె-డేవిడ్‌సన్, ట్రయంఫ్‌లు ఈ సెగ్మెంట్‌లోకి దూకుడుగా ప్రవేశించాయి. హార్లే దేశీయ హీరో మోటోకార్ప్‌తో, ట్రయంఫ్ బజాజ్ ఆటోలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో సరఫరా, అమ్మకాలను ప్రారంభించాయి. కంపెనీల వివరాల ప్రకారం, ఈ ఏడు నెలల కాలంలో రెండు బ్రాండ్లు 350సీసీ విభాగంలో అద్భుతమైన గణాంకాలు సాధించాయి. ఫిబ్రవరి నాటికి ట్రయంఫ్ స్పీడ్400, స్క్రాంబ్లర్ 400ఎక్స్ మోడళ్లను 15,000 యూనిట్లను విక్రయించినట్టు బజాజ్ ఆటో తెలిపింది. హీరో మోటోకార్ప్ సైతం 10,000 యూనిట్ల హార్ ఎక్స్440 బైకులను విక్రయించినట్టు వెల్లడించింది. మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023-24 ఏప్రిల్-జనవరి మధ్య 81,679 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 82,344 యూనిట్లతో పోలిస్తే స్థిరంగా ఉంది. హార్లె, ట్రయంఫ్ రెండూ 2023, జూలైలో దేశీయంగా తమ బైకులను విడుదల చేశాయి.ఇప్పటివరకు హార్లె 10 వేల యూనిట్ల విక్రయాలతో రానున్న నెలల్లో మెరుగైన డిమాండ్‌ను తీర్చేందుకు, సకాలంలో డెలివరీ అందించేందుకు ఉత్పత్తిని పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కస్టమర్లకు చేరువ కావడానికి ప్రత్యే హార్లె-డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌లు, హీరో ప్రీమియా స్టోర్లతో పాటు కొత్త రిటైల్ టచ్‌పాయింట్లను విస్తరిస్తున్నట్టు తెలిపింది. బజాజ్ ఆటో కూడా ట్రయంఫ్ బైకులకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతుల కోసం ఉత్పత్తిని పెంచింది. 

Tags:    

Similar News