FDIs: ఎఫ్‌డీఐల సమీక్షకు కొత్త నియంత్రణ యంత్రాంగాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం

ప్రస్తుతానికి ఈ అంశం పరిశీలన దశలోనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Update: 2024-09-29 15:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలోకి వచ్చే ఎఫ్‌డీఐల సమీక్ష, పర్యవేక్షణ కోసం విదేశీ పెట్టుబడుల నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశం పరిశీలన దశలోనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనేక దేశాలు తమ దేశంలోకి వచ్చే ఎఫ్‌డీఐలను పర్యవేక్షిస్తున్నాయని భారత్ గమనించింది. దేశీయంగా ఇలాంటి మెకానిజం ఉండాలని, తద్వారా నిధులపై పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని సూచనలు ప్రభుత్వానికి అందాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థకు ప్రయోజనకరంగా నిధుల మూలల గురించి స్పష్టత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం భారత్ 1.4 బిలియన్ డాలర్ల(రూ. 11.72 వేల కోట్ల)తో ఎఫ్‌డీఐలకు కీలక గమ్యస్థానంగా ఉంది. ముఖ్యంగా అధిక జనాభా, స్థిరమైన ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై రాబడి, శ్రామికశక్తి వంటి అంశాలు ఎఫ్‌డీఐలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే సులభతర ప్రక్రియల ద్వారా సులభతరమైన వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐల కోసం ప్రత్యేక రెగ్యులేటరీ మెకానిజం వల్ల అంతర్జాతీయ సవాళ్ల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా భారత్ తీసుకునే చర్యలు పారదర్శకంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని నిపుణులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News