India Rich List: అంబానీని దాటేసిన అదానీ.. మొత్తం సంపద రూ.11.6 లక్షల కోట్లు
ఇండియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీని దాటి అగ్ర స్థానంలో నిలిచారు
దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీని దాటి అగ్ర స్థానంలో నిలిచారు. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, దాదాపు రూ. 11.6 లక్షల కోట్ల(రూ. 11,61,800 కోట్ల) సంపదతో గౌతమ్ అదానీ మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద ఏడాది కాలంలో ఏకంగా 95 శాతం పెరిగింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను సైతం ఎదుర్కొని తిరిగి నిలబడ్డారని నివేదిక పేర్కొంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ రూ.10.14 లక్షల కోట్ల(రూ.10,14,700 కోట్ల)తో భారత్‌లో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మూడవ స్థానంలో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబం రూ. 314,000 కోట్ల విలువైన సంపదతో ఉన్నారు. ప్రఖ్యాత వ్యాక్సిన్ వ్యాపారవేత్త, సైరస్ ఎస్ పూనావాలా రూ. 2,89,800 కోట్ల సంపదతో జాబితాలో నాల్గవ స్థానాన్ని పొందారు.
హురున్ నివేదిక ప్రకారం, ఇండియాలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 75 మంది పెరిగారు. ప్రస్తుతం 1,500 మందికి పైగా వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఇది ఏడు సంవత్సరాల క్రితంతో పోలిస్తే గణనీయంగా 150 శాతం వృద్ధి చెందింది. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రూ.7,300 కోట్ల విలువైన నికర విలువ కలిగిన వ్యక్తిగా తొలిసారి చోటు దక్కించుకున్నారు. ప్రధానంగా కోల్‌కతా నైట్ రైడర్స్ క్రికెట్ జట్టు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడులు ముఖ్యపాత్ర పోషించాయి.
ఇంకా, జుహీ చావ్లా, ఆమె కుటుంబం, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్‌లతో సహా చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖ వ్యక్తులు కూడా జాబితాలో స్థానాలను పొందారు. 5 బిలియన్ డాలర్ల వాణిజ్య స్టార్టప్ అయిన Zeptoకి చెందిన 21 ఏళ్ల కైవల్య వోహ్రా అతి పిన్న వయసులనే జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తర్వాత, సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా(22), ఈ జాబితాలో రెండవ అతి పిన్న వయస్కుడిగా ఉన్నారు.
నగరాల పరంగా, హైదరాబాద్ ఈ సంవత్సరం హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మూడవ స్థానానికి చేరుకోవడంతో మొదటిసారి బెంగళూరును అధిగమించింది. నగరం నుంచి జాబితాలోకి కొత్తగా 17 మంది చేరారు. మొదటి స్థానంలో ముంబై, రెండో స్థానంలో న్యూఢిల్లీ ఉన్నాయి. హురున్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశం బిలియనీర్ల సంఖ్య పరంగా 29 శాతం వృద్ధిని సాధించగా, ఇదే సమయంలో చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 25 శాతం క్షీణించింది. గత ఐదు సంవత్సరాలలో, ఆరుగురు వ్యక్తులు భారతదేశం టాప్ 10లో నిలకడగా ఉన్నారు. వారు.. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, శివ్ నాడార్, సైరస్ S. పూనావాలా, గోపీచంద్ హిందూజా, రాధాకిషన్ దమానీ.