ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను మొదలుపెట్టిన విదేశీ పెట్టుబడిదారులు!

వరుస నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు.

Update: 2023-09-10 13:11 GMT

ముంబై: వరుస నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఆరు నెలల పాటు స్థిరమైన కొనుగోళ్ల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగవచ్చని యెస్ సెక్ర్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ నితాషా శంకర్ అన్నారు. రానున్న రోజుల్లో భారత కరెన్సీ రూపాయి మారకంపై మదుపర్లు ఓ కన్నేసి ఉంచుతారని ఆయన అభిప్రాయపడ్డారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,203 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు.


Similar News