Noel Tata: టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌గా నోయల్‌ టాటా నియామకం

టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ పదవిపై సస్పెన్స్ వీడింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ పదవిపై నోయల్‌ టాటా (Noel tata) నియామకం అయ్యారు.

Update: 2024-10-11 09:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ పదవిపై సస్పెన్స్ వీడింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ పదవిపై నోయల్‌ టాటా (Noel tata) నియామకం అయ్యారు. రతన్‌ టాటా మృతి తర్వాత ఆయన వారసుడిగా నోయల్‌ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సర్ రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ల సమావేశం తరువాత ఈ నిర్ణయం వెలువడింది. నోయెల్ టాటా 2000 సంవత్సరం ప్రారంభంలో టాటా గ్రూప్ లో చేరారు. అప్పట్నుంచి టాటా గ్రూప్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన రతన్‌ టాటాకు వరసకు సోదరుడు అవుతారు. రతన్ టాటా సవతి తల్లి సిమోన్‌ టాటా కుమారుడే నోయల్. ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్‌ కంపెనీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్‌కు వైస్‌ ఛైర్మన్‌గానూ ఉన్నారు. శ్రీ రతన్‌ టాటా ట్రస్ట్‌ బోర్డులోనూ నోయల్‌ సభ్యుడిగా ఉన్నారు.

14 ట్రస్టుల సమాహారం

టాటా ట్రస్ట్స్ అనేది మొత్తం 14 ట్రస్టుల సమాహారం. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కే 50 శాతం కన్నా ఎక్కువగా వాటా ఉంది. అందుకే, ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తే టాటా గ్రూప్స్ కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌గా రతన్‌ టాటా ఉన్నారు. ఆయన మరణంతో టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ పదవి ఖాళీ అయ్యింది. అయితే, ఆ స్థానంలోఇప్పుడు ఈ బాధ్యతలను నోయల్‌ టాటాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్‌లో ప్రస్తుతం వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇకపోతే, రతన్ టాటా తమ్ముడు జిమ్మీ కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోలేదు. సౌత్ ముంబైలోని కొలాబాలో నిరాడంబరమైన రెండు పడక గదుల అపార్ట్ మెంట్లో నివసిస్తున్నారు.


Similar News