తొమ్మిది నెలల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు!

విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో మరింత ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన ఆర్థిక గణాంకాలు, నెమ్మదించిన వాల్యుయేషన్ వంటి సానుకూల అంశాల కారణంగా గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 43,838 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Update: 2023-06-04 12:57 GMT

ముంబై: విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో మరింత ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన ఆర్థిక గణాంకాలు, నెమ్మదించిన వాల్యుయేషన్ వంటి సానుకూల అంశాల కారణంగా గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 43,838 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది తొమ్మిది గరిష్ఠమని మార్కెట్ నిపుణులు తెలిపారు. 2022, ఆగష్టులో ఎఫ్‌పీఐలు అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉందని, జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి.

గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. విదేశీ పెట్టుబడిదారులు ముఖ్యంగా ఫైనాన్స్, ఆటో, టెలికాం, నిర్మాణ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. అలాగే, ఈక్విటీల్లో మాత్రమే కాకుండా డెట్ మార్కెట్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 3,276 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 2023లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో రూ. 35,748 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 7,471 కోట్లు పెట్టుబడి పెట్టారు. 

Tags:    

Similar News