బడ్జెట్‌లో 11 శాతం పెరగనున్న ఆహార సబ్సిడీ వ్యయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆహార సబ్సిడీలపై ప్రభుత్వం దాదాపు రూ. 2.25 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Update: 2024-07-17 15:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్ అంచనాతో పోలిస్తే 11 శాతం అధికంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆహార సబ్సిడీలపై ప్రభుత్వం దాదాపు రూ. 2.25 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూలై 23న జరగనున్న సమగ్ర బడ్జెట్‌ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెరుగుదల ప్రధానంగా రైతులకు మద్దతు ధరపై అధిక వ్యయం అందించేందుకని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆహార, ఎరువుల సబ్సిడీలు కలిపి సంయుక్త వ్యయం రూ. 3.88 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. ఇది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో అంచనా కంటే 5 శాతం అధికం. ఈ నెలాఖరు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోయే సమగ్ర బడ్జెట్‌లో మధ్యంతర బడ్జెట్ అంచనాలను సవరిస్తారు. మధ్యంతర బడ్జెట్‌లో 2024-25కు దేశ మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లలో ఆహర, ఎరువుల సబ్సిడీల వాటా 8శాతంగా ఉంది. ఆహార సబ్సిడీ ప్రాథమిక అంచనా రూ. 2.05 లక్షల కోట్లు. ఆహార సబ్సిడీ పెరిగినప్పటికీ, ఎరువుల సబ్సిడీ గతంలో అంచనా వేసిన రూ. 1.64 లక్షల కోట్లనే కొనసాగించే అవకాశం ఉంది. 


Similar News